Telangana Inter Results
Telangana Inter Results: ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఇంటర్ విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఈసారి ఫలితాల విడుదల విషయంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. 1,532 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే, సమాధాన పత్రాల మూల్యాంకనం ఈనెల 18వ తేదీ నుంచి 19 కేంద్రాల్లో ప్రారంభమైంది. ప్రస్తుతం మూల్యాంకనం ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. అయినా, ఫలితాల విడుదల కాస్త ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా మూల్యాంకన ప్రక్రియలో ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
సమాధాన పత్రాలు మూల్యాంకనం తరువాత ఫెయిల్ అయిన విద్యార్థుల సమాధాన పత్రాలను రెండోసారి (రీవాల్యుయేషన్) పరిశీలిస్తున్నారు. ఇంటర్ విద్య సంచాలకుడు కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను ఈనెల 11న ప్రారంభించారు. సాధారణంగా ఫలితాలు విడుదల తరువాత ఫెయిలైన విద్యార్థులు పునర్ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇందుకు ఇంటర్ బోర్డు పేపరుకు రూ.600 చొప్పున వసూలు చేస్తుంది. అయితే, దీనికి ముందే ఈ ప్రక్రియను ఇంటర్ బోర్డు ఈసారి స్వచ్ఛందంగా చేపట్టింది. మూల్యాంకనంలో చిన్నపాటి తప్పిదాలతో ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టింది.
ఈ కారణంగా 20వ తేదీ కంటే ముందే రావాల్సిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో వారంరోజుల్లో రీవాల్యుయేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈనెల 21వ తేదీన ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. ఫలితాలను ఈసారి వాట్సాప్ నకు పంపించేందుకు బోర్డు ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఈసారికి సాధ్యంకాకపోయినా.. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల నాటికి కచ్చితంగా సిద్ధం చేస్తామని ఓ అధికారి పేర్కొన్నారు.