×
Ad

BC Bandh : మొన్న షర్మిల.. ఇప్పుడు కవిత.. బీసీ బంద్ లో కవిత కొడుకు.. చూడండి ఎలా ఉన్నాడో..

BC Bandh : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది.

Kalvakuntla Kavitha son Aditya participated in BC bandh

BC Bandh : తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత నెలలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించి.. ఉల్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి కూడా పాల్గొనడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. షర్మిల ఈ అంశంపై స్పందిస్తూ.. రావాల్సిన సమయంలో రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడంటూ తెలిపారు. అయితే, తాజాగా.. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. బీసీ బంద్ లో తల్లితో కలిసి ఆదిత్య పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని రోడ్డుపై బైఠాయించాడు. దీంతో అందరి దృష్టి ఆదిత్యపై పడింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. ఈ బంద్ కు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో బంద్ విజయవంతం అయింది. బీసీ బంద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా పాల్గొన్నారు. అయితే, ఈ బంద్‌లో కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాసిఉన్న ప్లకార్డును పట్టుకొని ఆధిత్య రోడ్డుపై బైఠాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు నెటిజన్లు ఏపీలో షర్మిల కుమారుడు.. తెలంగాణలో కవిత కుమారుడు రాజకీయాల్లోకి ఎంట్రీ అంటూ పేర్కొంటున్నారు.

బీసీ బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం నిర్వహించారు. ఈ మానవహారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జాగృతి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉంది. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్, బీజేపీలపై కవిత విమర్శలు గుప్పించారు.

బీసీ బిడ్డలను పదేపదే మోసం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి. యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కవిత కోరారు.

బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే కోర్టు జీవోను కొట్టేసిందని కవిత అన్నారు.

బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది? మహారాష్ట్ర, తమిళనాడు లో ఐదేళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కవిత అన్నారు . బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కవిత డిమాండ్ చేశారు.