Liquor Price Hike : మందు బాబులకు బిగ్ అలర్ట్.. మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయ్.. కారణాలివే? ఎంత శాతం పెరుగుతాయంటే?

Telangana Liquor Price Hike : తెలంగాణలోని మందు బాబులకు బిగ్ షాకింగ్ న్యూస్. మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయి.

Liquor Prices Likely to Increase Soon

Telangana Liquor Price Hike : తెలంగాణలోని మందు బాబులకు బిగ్ షాకింగ్ న్యూస్. మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయి. మద్యం తయారీ సంస్థల విజ్ఙప్తి మేరకు ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రముఖ బ్రాండ్లపై సుమారు 15శాతం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Gold Rate : మళ్లీ బంగారం దూకుడు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ. 2 లక్షలు కాబోతోందా ? నిపుణులు ఏమన్నారంటే?

మద్యం తయారీ సంస్థలు చాలా కాలంగా ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ (పీఎఫ్‌సీ) గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతో దాదాపు మూడేళ్ల తరువాత మద్యం రిటైల్ ధరలు (ఎంఆర్‌పీ) సవరణకు మార్గం సుగమమైంది.

పీఎఫ్‌సీ కమిటీ సమర్పించిన సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించిన తరువాత ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్)తో పాటు ఇతర మద్యం రకాల గరిష్ఠ చిల్లర ధరలను సవరించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. కమిటీ నివేదికే ప్రభుత్వ నిర్ణయానికి ప్రాతిపదిక కానుంది. అయితే, ధరల ఎంత మేర పెంచాలని కమిటీ సిఫార్సు చేసిందనే విషయం ఇప్పటి వరకు వెల్లడికాలేదు. మద్యం తయారీ సంస్థలు మాత్రం ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

2023లో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఆ తరువాత 2025లో మద్యం ధరల్లో మార్పులు చేయాల్సి ఉన్నప్పటికీ.. తయారీ సంస్థలు, ఇతర భాగస్వాముల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేయడంతో ప్రక్రియ ఆలస్యమైంది. 2023లో ధరల సవరణలో తక్కువ ధరల మద్యం బ్రాండ్లపై అత్యధికంగా 15శాతం ధరలు పెరిగాయి. మధ్యస్థాయి బ్రాండ్ల ధరలు 12శాతం, సెమీ ప్రీమిడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు 6 నుంచి 10శాతం వరకు పెరిగాయి. అయితే, ఈ సారి ఎంత పెంచుతారనే అంశంపై స్పష్టం రావాల్సి ఉంది. ప్రస్తుతం కమిటీ నివేదికపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కోసం మద్యం తయారీ సంస్థలు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

ఇదిలాఉంటే.. పీఎఫ్‌సీ కమిటీ మద్యం పరిశ్రమ ప్రతినిధులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల, పన్నుల భారం, రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలపై వివరాలను సేకరించి వాటిని పరిశీలించిన తరువాతే నివేదికను ఖరారు చేసింది. గత మూడేళ్లలో ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు గణనీయంగా పెరగడంతో తమ లాభాలపై తీవ్ర ప్రభావం పడిందని మద్యం తయారీ కంపెనీల ప్రతినిధులు వాదిస్తున్నాయి. పరిశ్రమ కొనసాగింపుకు, పెరిగిన ఖర్చులను భర్తీ చేసుకోవడానికి ఎమ్మార్పీ పెంచడం తప్పనిసరి అని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.