CM Revanth Reddy
తెలంగాణ మంత్రులు పార్టీ అధిష్టానం మాట వినడంలేదా? మీరెన్ని చెప్పినా మా దారి మాదే.. మేమింతే అన్నట్లుగా మంత్రులు వ్యవహరిస్తున్నారా? అధిష్టానం మొట్టికాయలేసినా మంత్రుల తీరు మారడంలేదా? అందుకే వారిపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందా? పార్టీ అధిష్టానం ఇచ్చిన టాస్క్‌ను పట్టించుకోవడం లేదా..?
వారి నిర్లక్ష్యం కారణంగానే ఈ మధ్య జిల్లాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రులకు ఇచ్చిన టాస్క్ ఏంటి..? మంత్రులు ఎందుకు ఆ టాస్క్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధిష్టానం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. నేతల మధ్య సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను అధిష్టానం రాష్ట్ర మంత్రులకు అప్పగించింది. ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలతో పాటు పార్టీకి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల ఆధారంగా మంత్రులకు ఇన్‌చార్జ్ బాధ్యతలను అప్పగించారు.
ఆయా జిల్లాకు సంబంధించి పాలనా వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యత ఇంచార్జ్ మంత్రులదే అని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇంచార్జ్ లను సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని మంత్రులకు ఆదేశాలిచ్చారు. అయితే ఈ విషయంలో మంత్రులు మాత్రం ఇంచార్జ్ గా ఉన్న జిల్లాల విషయంలో తూతూ మంత్రంగా పర్యటిస్తూ..ఏ మాత్రం పట్టించుకోవడంలేదట. పై నుంచి ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే..ఆ సమయానికి ఒకట్రెండు సమావేశాలు పెట్టి మమా అనిపిస్తున్నారట.
జిల్లాల్లో తరచూ పర్యటనలు చేయాలని ఆదేశాలు
జిల్లాల్లో పార్టీ బలోపేతం కావాలంటే మంత్రులు కచ్చితంగా వారికి కేటాయించిన జిల్లాల్లో తరచూ పర్యటనలు చేయాలని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ స్వయంగా గాంధీభవన్‌లో సమావేశం పెట్టిమరీ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో పాటు నేతలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని కేసీ ఆదేశించారు. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఒకట్రెండు సార్లు ఇదే విషయం స్పష్టం చేశారు.
ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు క్లాస్ కూడా తీసుకున్నారని సమాచారం. ఇంచార్జ్ ఇచ్చిన జిల్లాల్లో ఎమ్మెల్యేలను ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదని గట్టిగా నిలదీశారు. ఈ సందర్భంగా ఒకట్రెండు సార్లు మాత్రమే ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు సమావేశాన్ని ఏర్పాటుచేస్తే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని గట్టిగానే నిలదీశారట.
ఆయా జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల ఎజెండా ఏంటనే దానిపై సీఎం నివేదికలు కూడా తీసుకున్నారు. అయితే ఆ నివేదికల్లో మంత్రులు పరిష్కరించిన అంశాల గురించి వివరాలేవీ సీఎంకు కన్పించలేదంట. దీంతో అసలు మంత్రులు జిల్లాల్లో పర్యటించడంలేదన్న విషయం అటు పార్టీ హైకమాండ్ కు ఇటు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టంగా అర్థమైందట.
పార్టీ హైకమాండ్ ఆదేశించినా..సీఎం రేవంత్ పదే పదే చెప్పినా ఇన్‌చార్జ్ మంత్రుల తీరు మాత్రం మారడంలేదట. కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మంత్రుల తీరుపై అసంతప్తి వ్యక్తం వ్యక్తం చేశారట. మంత్రులు ఇలాగే వ్యవహరిస్తే..పార్టీ పరిస్థితి ఏంటనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట. త్వరలో రానున్న లోకల్ బాడీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ప్లానింగ్, జిల్లాల్లో ముఖ్యనేతల మధ్య ఉన్న గొడవలు సద్దుమణిగేలా చేయడంలో మంత్రులు పూర్తిగా విఫలమవుతున్నారంటూ పార్టీ అధిష్టానానికి నివేదికలు అందాయట.
ఈ మధ్య కాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాల అంశాలను ఉదహరిస్తున్నారట. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమస్యలు తీవ్రతరమవుతున్నా పట్టించుకోవడం లేదట. పటాన్‌చెరు, గద్వాల, కరీంనగర్ లో నేతలు బాహాబాహికి దిగినా..మంత్రులు రంగంలోకి దిగి సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
అయితే మంత్రులు వారి వారి సొంత జిల్లాలు, సొంత నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అక్కడి సమస్యలపైనే ఫోకస్ పెడుతున్నారని హస్తం పార్టీనేతల్లో చర్చ నడుస్తోంది. ఆయా జిల్లాల్లో జరిగే అభివృద్ధి పనులను చేయించుకోవడం, అక్కడి పైరవీలపైనే దృష్టి పెడుతున్నారంటూ పార్టీ క్యాడర్లో టాక్ విన్పిస్తోంది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రుల విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాఫిక్‌గా మారింది.