Teenmaar Mallanna Leading ( Image Credit : Google )
MLC Counting : ఖమ్మం-నల్గొండ వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత 18,565 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉండగా, రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ప్రధాన పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్లు ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్ 1,22,813 ఓట్లు, బీఆర్ఎస్ 104248 ఓట్లు, బీజేపీ 43313, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ 29697 ఓట్లను సాధించాయి. నల్లగొండ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో మొత్తం పోలైన ఓట్లు 3,36,013 కాగా, చెల్లుబాటు అయిన ఓట్లు 3,10,189 ఉన్నాయి. చెల్లని ఓట్లు 25,824గా నమోదయ్యాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత 1,55,095 గెలుపు కోటాగా నిర్ధారించారు. కోటాకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 32,282 ఓట్ల దూరంలో ఉండగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి 50847 ఓట్ల దూరంలో ఉన్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో అధికారులు సైతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.