Municipal Elections : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ షురూ.. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూకట్టిన ఓటర్లు..
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది..
- Harishth Thanniru
- Published On : February 11, 2026 / 07:19 AM IST
Telangana Municipal Elections 2026
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7గంటలకు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం ఏడు నగరపాలక సంస్థల్లోని 414 డివిజన్లకు, 116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో రెండు డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మరోవైపు.. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో ఆ వార్డులో ఎన్నిక వాయిదా పడింది. కాగా.. మిగిలిన 412 డివిజన్లు.. 2,569 వార్డుల్లో బుధవారం ఉదయం 7గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు క్యూ కట్టారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల, బయట వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు.. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంకు వెళ్లనున్నారు. కొడంగల్ మున్సిపాలిటీలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రీ పోలింగ్ అవసరమైతే 12న నిర్వహిస్తారు. 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.
