×
Ad

Municipal Election : తెలంగాణలో మున్సిపల్ పోరు.. రిజర్వేషన్లు ఖరారు.. బీసీ, ఎస్సీలకు కేటాయింపులు ఇలా..

Municipal Election : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్‌పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

State Election Commission

Municipal Election Reservations : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి వార్డుల రిజర్వేషన్లు, చైర్‌పర్సన్, మేయర్ల పదవుల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మహిళల వారీగా వార్డులు, డివిజన్లు, చైర్మన్, మేయర్ పదవులు ఏ కేటగిరికీ ఎన్ని దక్కుతాయో వెల్లడించింది.

Also Read : Telangana Congress: మున్సిపోల్స్ వేళ కాంగ్రెస్‌‌ పెద్దల్లో కలవరం..! కారణం ఏంటి.. పరిష్కారం ఎలా..

రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల జరగనున్నాయి. అయితే, మున్సిపల్ వార్డులు, డివిజన్‌లలో ఎస్సీ, ఎస్టీ‌లకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్ స్థానాలు కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు, 2019 తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళలకు రిజర్వు స్థానాలను కేటాయించారు.

బీసీలకు మున్సిపాలిటీల్లో 31.4శాతం, కార్పొరేషన్లలో 30శాతం సీట్లు రిజర్వు చేశారు. దీంతో 121 మున్సిపాలిటీల్లో బీసీలకు 38 చైర్మన్ పదవులు రిజర్వు అయ్యాయి. ఇందులో బీసీ జనరల్‌కు 19, బీసీ మహిళకు 19 చొప్పున ఖరారయ్యాయి. 10 కార్పొరేషన్ల పరిధిలో బీసీలకు మూడు మేయర్ పదవులు రిజర్వు చేయగా.. ఇందులో బీసీ మహిళలకు ఒకటి, బీసీ జనరల్‌కు రెండు మేయర్ పదవులు దక్కనున్నాయి.

మున్సిపల్ కార్పోరేషన్‌లలో ఎస్టీ జనరల్ ఒకటి, ఎస్సీ జనరల్ ఒకటి, బీసీ జనరల్ రెండు స్థానాలు కేటాయించగా.. బీసీ మహిళకు ఒకటి, జనరల్ మహిళ నాలుగు, ఒక స్థానంలో జనరల్‌కు కేటాయించారు.

మున్సిపాలిటీల్లో మొత్తం 121 స్థానాలకుగాను.. ఎస్టీ జనరల్ -3, ఎస్టీ మహిళ – 2, ఎస్సీ జనరల్ – 9, ఎస్సీ మహిళ -8, బీసీ జనరల్ – 19, బీసీ మహిళ – 19, జనరల్ మహిళ – 31, జనరల్ -30 స్థానాలను కేటాయించారు.