Nirmal District : నిర్మల్ జిల్లాలో సవతి తల్లి ఘాతుకం.. కొడుకుతో అనైతిక బంధం.. చివరికి హత్య.. అసలేం జరిగిందంటే?
Nirmal District Stepmother Supari Murder Case : వావివరసలు మరిచి సవతి తల్లితో ఏర్పడిన అనైతిక సంబంధం చివరకు ఓ యువకుడి ప్రాణాలు తీసింది.
- Harish Thanniru
- Published on- July 25, 2026 / 08:52 AM IST
Nirmal District SP Janaki Sharmila revealing details of Stepmother Supari Murder Case
- నిర్మల్ జిల్లాలో సవతితల్లి ఘాతుకం
- సవతి కొడుకుతో అనైతిక బంధం..
- పెళ్లి చేసుకొని వెళ్లిపోతాననడంతో హత్య
Nirmal District Stepmother Supari Murder Case : నిర్మల్ జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వావివరసలు మరిచి సవతి తల్లితో ఏర్పడిన అనైతిక సంబంధం చివరకు ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మరో వివాహం చేసుకుని తన నుంచి దూరమవుతాడనే కక్షతో సవతి తల్లే సుపారీ గ్యాంగ్‌కు డబ్బులు ఇచ్చి యువకుడిని హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్‌కు చెందిన ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ (28) తండ్రి 17 సంవత్సరాల క్రితం అన్వరీ బేగం (41)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. కొంతకాలంగా అస్లాం ఖాన్, అన్వరీ బేగం మధ్య ఎవరికీ తెలియకుండా అనైతిక సంబంధం కొనసాగుతోంది. అయితే ఈ బంధానికి ముగింపు పలికి మరో యువతిని వివాహం చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలని అస్లాం ఖాన్ నిర్ణయించుకున్నాడు. దీంతో అతడిని పెళ్లి చేసుకోవద్దని, అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానంటూ అన్వరీ బేగం ఒప్పించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అతడు వినకపోవడంతో చంపేస్తానంటూ బెదిరించింది.
ప్రాణభయంతో అస్లాం ఖాన్ ఈ విషయాన్ని తన బాబాయ్‌కు చెప్పడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసి వివాదం చెలరేగింది. అనంతరం అస్లాం నిర్మల్‌లోని వైఎస్సార్ కాలనీలో బాబాయ్ ఇంటికి వెళ్లి ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన రహస్యం బయటపడటంతో పరువు పోయిందనే ఆగ్రహంతో పాటు, అస్లాం మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోతాడనే కక్షతో అన్వరీ బేగం అతడిని హత్య చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మహారాష్ట్రకు చెందిన ముఖీద్ అనే వ్యక్తితో రూ.6 లక్షలకు సుపారీ మాట్లాడి, రూ.50 వేల అడ్వాన్స్ ఇచ్చింది. తన సొంత తమ్ముడు షేక్ మహ్మద్‌ను కూడా డబ్బులు ఆశ చూపి కుట్రలో భాగస్వామిని చేసింది.
అస్లాం ఫోటోలు, ఆటో నంబర్‌తో పాటు అతడి కదలికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సుపారీ గ్యాంగ్‌కు అందించింది. ఈ నెల 15వ తేదీ ఉదయం వైఎస్సార్ కాలనీ వద్ద ఆటోలో ప్రయాణికులతో వస్తున్న అస్లాంను ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్ పవార్, షేక్ షాహిద్ అలియాస్ సల్మాన్ కారుతో అడ్డగించి బయటకులాగి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అస్లాం చికిత్స పొందుతూ అదే రోజు ఆస్పత్రిలో మృతి చెందాడు.
ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన కుట్రదారైన అన్వరీ బేగంను జూలై 17న అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ముఖీద్, అఫ్రోజ్, సాయినాథ్ పవార్, షేక్ షాహిద్, షేక్ మహ్మద్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
