Telangana online education : బడి గంటకు వేళయిందా..? త్వరలో విద్యాసంస్థలు ఓపెన్ అవుతాయా..? తెలంగాణలో ఇప్పడిదే హాట్‌టాపికై కూర్చుంది. అన్‌లాక్ ప్రక్రియలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు రోడెక్కాయి. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక స్కూల్స్ కూడా ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తోంది.
అన్‌లాక్ 5.0లో విద్యాసంస్థలు ఓపెన్ చేసుకునే అవకాశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. దీంతో తెలంగాణలో ఈనెల 15 నుంచి విద్యాసంస్థలు ఓపెన్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే పిల్లల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి ఆన్‌లైన్ క్లాస్‌లు నడుస్తున్నాయని అదే కంటిన్యూ చేయడం మంచిదంటున్నారు పేరెంట్స్.
కరోనాకి వ్యాక్సిన్ రాకుండా పిల్లల్ని స్కూల్‌కి ఎలా పంపించేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు మాత్రం పేరెంట్స్ వాదనను కొట్టిపడేస్తున్నారు. స్కూల్స్ ఓపెన్ చేయకుంటే పిల్లల్లో మానసిక ఎదుగుదల ఆగిపోతుందని అంటున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం పాఠశాలల పునఃప్రారంభాన్ని స్వాగతించారు.
కరోనా రూల్స్ పాటించాలంటే నిధులు మాత్రం తప్పనిసరంటున్నారు. ప్రభుత్వం స్కూల్స్ పునఃప్రారంభంపై సమాలోచనలు చేస్తోంది. ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది. మరోవైపు తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తీసుకుంటోంది. పరిస్థితి చూస్తుంటే.. స్కూల్స్ ఓపెన్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది.