×
Ad

Telangana Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ పోరు.. బరిలో చంద్రబాబు, జగన్..!

Telangana Panchayat Elections : తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో..

Telangana Panchayat Elections

Telangana Panchayat Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మూడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. తొలి విడత ఈనెల 11వ తేదీన, రెండో విడత ఈనెల 14వ తేదీన, మూడో విడత ఈనెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే మూడు విడతలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మురం చేశారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అయితే, పంచాయతీ ఎన్నికల పోరులో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికోసం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ పడుతున్నారు. పలు గ్రామాల్లో సర్పంచ్ పదవికోసం అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు, అత్తాకోడళ్లు, తోడికోడళ్లు బరిలో నిలిచి పోటీ పడుతున్నారు. అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఓ పంచాయతీలో అత్త, కోడలు ఇద్దరూ కాంగ్రెస్ మద్దతుదారుగా బరిలో నిలిచారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్ లో సర్పంచ్ అభ్యర్థిత్వానికి ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు పోటీపడుతున్నారు. సిద్ధిపేట జిల్లా రామాయంపేట మండలంలోని ఓ పంచాయతీలో తండ్రి, కొడుకులు సర్పంచ్ పదవికోసం పోటీపడుతున్నారు. ఇదిలాఉంటే.. పంచాయతీ పోరులో మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌లు కూడా పోటీ పడుతున్నారు. చంద్రబాబు, జగన్ అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు గుర్తుకు వచ్చేది ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వీరిపేర్లు కలిగిన ఇద్దరు అభ్యర్థులు ఒకే పంచాయతీలో పోటీ పడుతుండటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామానికి చెందిన వీరు సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. వారి పేర్లు భూక్యా చంద్రబాబు, బానోత్ జగన్నాథం అలియాస్ జగన్. ఇద్దరూ కాంగ్రెస్ లోని ఇరు వర్గీయుల మద్దతుతో బరిలోకి దిగారు. వీరి పేర్లు కారణంగా పోటీతోపాటు ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఈనెల 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉన్నప్పటికీ ఇద్దరూ బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే, వీరి మధ్య సయోధ్య కుదర్చి ఒకరిని నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.