Supreme Court
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే, పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
విచారణ నిమిత్తం.. అమెరికా నుంచి భారత్‌కు వచ్చే వేళ శ్రవణ్ కుమార్‌ను అరెస్టు చేయకుండా ఇవాళ ఇలా రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఏప్రిల్ 28 వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్యూరోక్రాట్లు, హైకోర్టు న్యాయమూర్తులపై జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ కుమార్ నిందితుడిగా ఉన్నారు. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. శ్రవణ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. శ్రవణ్ కుమార్ కి అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు.
Also Read: స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా గొడవ ఏంటి? ఎందుకీ వివాదం? ఎందుకు ఇంతలా తన్నుకుంటున్నారు?
శ్రవణ్ కుమార్‌కు మధ్యంతర రక్షణను తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు. కుమార్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు. శ్రవణ్ కుమార్ విచారణకు అందుబాటులో ఉంటారని, ఇప్పటివరకు పోలీసులు సెక్షన్ 41A [CrPC] కింద శ్రవణ్ కుమార్ కి ఒక్క నోటీసు కూడా పంపలేదని సుప్రీంకోర్టుకు శేషాద్రి నాయుడు చెప్పారు.
శ్రవణ్ కుమార్ ఏడాది కాలంగా పరారీలో ఉన్నారని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు. ఇవాళ శ్రవణ్ కుమార్ ను అరెస్టు చేస్తారా అని జస్టిస్ బీవీ నాగరత్న అడిగారు. ప్రస్తుతం శ్రవణ్ యూఎస్‌లో ఉండడంతో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని శేషాద్రి నాయుడు తెలిపారు. మధ్యంతర రక్షణ ఇస్తే 48 గంటల్లో శ్రవణ్ కుమార్ భారత్‌కు వస్తాడని కోర్టుకు శ్రవణ్ తరఫు న్యాయవాది చెప్పారు.