Telangana Rains
Telangana Rains : తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వీడడం లేదు. కొద్దిరోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రానికి మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట జారీ చేసింది.
అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది అక్టోబర్ 1వ తేదీ నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ గుజరాత్, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఇవాళ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు.. హైదరాబాద్ నగరంలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇదిలాఉంటే.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి వరకు 45 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. ఇంకా కొంతమేర పెరిగే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల గోదావరి తీర ప్రాంతంలో వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద వదులుతున్నారు. ఈ ప్రభావంతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం భద్రాచలం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద 48 అడుగులకు చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక అమల్లోకి వస్తుంది.