Local Body Election : స్థానిక ఎన్నికల్లో వాళ్లకు బిగ్‌షాక్.. పోటీ చెయ్యలేరు.. ఏపీలో ఓకే.. తెలంగాణలో మారని రూల్..
Local Body Election : ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన ఉంది.

Local Body Elections
Local Body Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (ఎస్ఈసీ) రాణికుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో తొలుత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనుండగా.. ఆ తరువాత మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ నిర్వహించనుంది.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,67,03,168 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 81,65,894.. మహిళా ఓటర్లు 85,36,770, ఇతరులు 504 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే, ఈ ఎన్నిల్లో ముగ్గురు పిల్లలు కలిగిన వారికి పోటీచేసే అవకాశం లేదు.
ఇద్దరు పిల్లలు కన్నా ఎక్కువ మంది ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది ఈ నిబంధనను ప్రభుత్వం తొలగిస్తుందని ఎదురు చూశారు. అదికాస్త జరగకపోవడంతో.. ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మేరకు ఈ నిబంధనను ఎత్తివేసి ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చుననే నిబంధన అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే, ప్రస్తుతం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీచేసే అవకాశం కల్పిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. తెలంగాణలో ముగ్గురు పిల్లల నిబంధనలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
ఏపీలో ముగ్గురు పిల్లల నిబంధనలో మార్పులు చేశారు. ప్రభుత్వం ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేసింది. ఆ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు, అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కలిగినవారు కూడా పోటీచేయొచ్చు. గతేడాది నవంబర్ నెలలో.. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నాసరే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించే చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో ఏపీలో ముగ్గురు పిల్లల నిబంధనను తొలగిపోయింది.
అధిక జనాభాను నియంత్రించే క్రమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994 మే30వ తేదీ నుంచి ముగ్గురు పిల్లల నిబంధన అమల్లోకి వచ్చింది. 1994లో తీసుకొచ్చిన ఈ నిబంధన వల్ల అప్పటి నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీకి చాలా మందికి అడ్డంకిగా మారింది. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల్లో పోటీకి అనర్హులని ఆనాటి ప్రభుత్వం చట్టం చేసింది. దాదాపు 30ఏళ్లుగా ఈ నిబంధనే కొనసాగుతోంది. అయితే, గతేడాది ఏపీ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ నిబంధన కొనసాగుతూనే ఉంది. దీంతో తెలంగాణలో ప్రస్తుతం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముగ్గురు, అంతకంటే ఎక్కువ పిల్లలు కలిగిన వారు పోటీకి అనర్హులు పోటీచేసేందుకు సిద్ధమవుతున్న ముగ్గురు పిల్లలు కలిగిన వారికి షాకింగ్ విషయమేనని చెప్పొచ్చు.