Mohammad Azharuddin: మినిస్టర్ అజారుద్దీన్.. మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ డౌటేనా?
గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణకు ఇలాగే మంత్రి పదవి ఇవ్వగా ఆరు నెలల్లోపు చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Mohammad Azharuddin: ఆయనకు అనూహ్యంగా అమాత్య యోగం దక్కింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే క్యాబినెట్‌లోకి అడుగుపెట్టారు. కానీ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు తప్పక ఎలక్ట్ కావాల్సిందే. లేదంటే మంత్రి పదవి ఊస్ట్ అవ్వడమే. ఇప్పటికే ఆయనను మండలికి పంపుతామంటూ రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది. కానీ ఆయన ఎమ్మెల్సీ అవడం అంత ఈజీ కాదని..అదంతా లిటిగేషన్‌లో ఉన్న వ్యవహారమన్న టాక్ వినిపిస్తోంది. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని అజారుద్దీన్ ఎంత కాలం మంత్రిగా ఉంటారు? ఆరు నెలల్లోపు అజార్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉందా? జాబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఎట్టకేలకు మంత్రి అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకునేందుకు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా అజారుద్దీన్ మంత్రి అవ్వడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జాబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అజారుద్దీన్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించినా..ఎంఐఎం పెట్టిన కండీషన్ తో అజారుద్దీన్ ను బైపోల్ రేసు నుంచి సైడ్ చేశారు. ఆ ఈక్వేషన్ లోనే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని క్యాబినెట్లో తీర్మానం చేశారు. అయితే సుప్రీంకోర్టులో కేసు ఉండటంతో అజారుద్దీన్ ఎమ్మెల్సీ అంశం పెండింగ్ లో పడింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవడం అంత ఈజీ కాదా?
అజారుద్దీన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవడం అంత ఈజీ కాదన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పట్లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం తేలే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. బీఆర్ఎస్ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యానారాయణను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తే అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఆ సీట్ల స్థానంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను క్యాబినెట్ ప్రపోజ్ చేయగా గవర్నర్ ఆమోదం తెలిపారు.
అజార్ పై దేశద్రోహం వంటి తీవ్రమైన కేసులు..
అయితే తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించటాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ ముందుగా హైకోర్టుకెళ్లారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై పలుమార్లు విచారించిన కోర్టు..కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. దీనిపై రేవంత్ సర్కార్ అప్పీల్ కు వెళ్లింది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ అంశం తేలినా అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది.
అజారుద్దీన్ పై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందులోనూ దేశద్రోహం వంటి తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్న అజారుద్దీన్ ను గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసే అవకాశమే లేదంటూ స్వయంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇక అజార్ పై ఉన్న ఆరోపణలు, కేసుల దృష్ట్యా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి. అయితే ఆరు నెలల్లోపు కాదు కదా..ఏడాది వరకు గవర్నర్ ఎమ్మెల్సీ మినహా మరే ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ అవ్వట్లేదు. దీంతో ఇప్పుడున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీటులోనే అజారుద్దీన్ మండలికి వెళ్లాల్సి ఉంటుంది. టెక్నికల్ గా, లీగల్ గా అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
మంత్రి పదవికి రిజైన్ చేసిన హరికృష్ణ..
గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణకు ఇలాగే మంత్రి పదవి ఇవ్వగా ఆరు నెలల్లోపు చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక బీఆర్ఎస్ నేత హరీశ్ రావు కూడా గతంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండానే మంత్రి అయ్యి..ఆ తర్వాత ఆరు నెలల్లోపు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ అజారుద్దీన్ కు మాత్రం ఆరు నెలల్లో చట్టసభకు ఎన్నికయ్యే అవకాశం లేదని అంటున్నారు.
అయితే పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కచ్చితంగా అనర్హత వేటు పడుతుందని, అప్పుడు ఖైరతాబాద్ నుంచి అజారుద్దీన్ ను పోటీ చేయించే అవకాశం కూడా లేకపోలేదన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఆరు నెలల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి తిరిగి ఫ్రెష్ గా మంత్రి అయ్యే వెసులుబాటు కూడా రాజ్యాంగంలో ఉంది కాబట్టి అజారుద్దీన్ విషయంలో కాంగ్రెస్ ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరీ అజార్ కు మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటేనా? లేక అమాత్య పదవిలో పూర్తి కాలం కొనసాగుతారా? చూడాలి.
Also Read: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో నేతల తీరుపై కేసీఆర్ అసంతృప్తి.. కామెడీ స్కిట్స్ పై సీరియస్
