KCR: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో నేతల తీరుపై కేసీఆర్ అసంతృప్తి.. కామెడీ స్కిట్స్ పై సీరియస్

టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..

KCR: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో నేతల తీరుపై కేసీఆర్ అసంతృప్తి.. కామెడీ స్కిట్స్ పై సీరియస్

Updated On : October 31, 2025 / 8:12 PM IST

KCR: దోసెలు వేయడం..కూరగాయలు అమ్మడం..బట్టలు ఇస్త్రీ చేయడం. ఇలాంటి స్కిట్స్ చెయ్యడం ఆపేయండి. ఎన్నికల ప్రచారం అంటే సరదా కాదు. కాస్త సీరియస్ క్యాంపెయిన్ చేయండి. ఇదీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు చేసిన హితోపదేశం. అవును..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కామెడీ ప్రచారాన్ని ఆపి..బీఆర్ఎస్ హయాంలో ఏం చేశామో..కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలేంటో వివరించాలని దిశానిర్ధేశం చేశారట గులాబీ బాస్. అయితే ఇదంతా మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి చెప్పినా.. కొంతమంది ఆయనను ఫాలో అవుతున్నారన్న ఉద్దేశంతోనే కేసీఆర్ నేతలకు క్లాస్ తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. సిట్టింగ్ సీటును తిరిగి కైవసం చేసుకునేందుకు..ఏ అవకాశాన్ని వదులుకోకుండా దూసుకెళ్తున్నారు గులాబీ లీడర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రతి అంశాన్ని కేటీఆర్, హరీశ్రావే స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న అధినేత కేసీఆర్..పార్టీ నేతలకు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. జాబ్లీహిల్స్ లో..గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలో గులాబీ పార్టీ బలంగా ఉందన్న సంకేతాలు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ఈ ఎన్నిక రానున్న స్థానిక సంస్థలు, ఆ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని..అందుకే జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందుకెళ్తోంది బీఆర్ఎస్.

దోసెలు వేయడం, అరటి పళ్లు అమ్మడం, కటింగ్ చేయడంపై సీరియస్..

జాబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంపై కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. పార్టీ ప్రచారం, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారట. ఈ సందర్బంగా కొందరు పార్టీ నేతల వ్యవహార శైలిపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కొంత మంది నేతలు చేస్తున్న సరదా పనులపై గులాబీ బాస్ కొంత అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ప్రచారంలో భాగంగా స్థానికంగా కొందరు నేతలు టిఫిన్ సెంటర్లలో దోసెలు వేయడం, అరటి పళ్లు అమ్మడం, హెయిర్ సెలూన్ లో కటింగ్ చేయడం వంటి పనులపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రచారంలో ఇలాంటి స్కిట్స్ చేస్తే కామెడీగా కాసేపు నవ్వుకోవడానికి ఉంటుందే తప్ప ఓటర్లను ఏ మాత్రం ఆకట్టుకోలేమని కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సరదా స్కిట్స్ మాజీ మంత్రి మల్లారెడ్డి మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా స్థానిక జనంతో కలిసి సరదా సరదా పనులు చేస్తున్నారు మల్లారెడ్డి. టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు మల్లారెడ్డి. ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో మరికొంత మంది నేతలు కూడా మల్లారెడ్డిని ఫాలో అవుతున్నారట.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని హితోపదేశం..

ప్రచారంలో కామెడీ స్కిట్స్ పై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఐతే నేరుగా మాజీ మంత్రి మల్లా రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఎన్నికల ప్రచారంలో ఇలాంటి సరదా స్కిట్స్ మానేయ్యాలని చెప్పారట. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి కామెడీ పనులు చేస్తే సోషల్ మీడియాలో ప్రచారానికి పనికి వస్తాయే గాని… ఓటర్లను ఏ మాత్రం ఆకట్టుకోవని కేసీఆర్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ప్రధానంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ సూచించారు. అందులోనూ హైదరాబాద్ అభివృద్దిని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రస్తావించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, ఉచితంగా తాగునీటి సౌకర్యం, కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం, ఐటీ రంగ అభివృద్ధి, శాంతి భద్రతలు వంటి అంశాలను ప్రచారం చేయాలని కేసీఆర్ సూచించారట. ఇదే సమయంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని…ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ ఆదేశించారని తెలుస్తోంది. కేసీఆర్ హితోపదేశంతోనైనా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి.

Also Read: తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు హ్యాక్.. అమ్మకానికి ఈ డేటా..