EV Charging Stations: ఈవీ వాహనదారులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 369 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు.. హైదరాబాద్ సహా జిల్లాల్లో నెట్‌వర్క్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్(EV Charging Stations) ఆపరేటర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది.
- V Santhosh Kumar
- Published on- September 6, 2026 / 06:18 PM IST
Telangana redco invites tenders for 369 public ev charging stations
- 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
- యూనిట్ ఛార్జింగ్ రూ. 13
- సెప్టెంబర్ 8 టెండర్లు ప్రారంభం
EV Charging Stations: రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించడం సహా ఈవీ మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, అప్‌గ్రేడేషన్, వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల (సీపీఓలు) నుంచి టెండర్లను ఆహ్వానించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 200 స్టేషన్లతో పాటు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 169 ప్రాంతాల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తేవడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
యూనిట్ ఛార్జింగ్ టారిఫ్ రూ. 13గా నిర్ణయం:
ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కాలపరిమితి 10 సంవత్సరాలు ఉంటుందని రెడ్కో వీసీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ వెల్లడించారు. వినియోగదారుల సౌకర్యార్థం ఛార్జింగ్(EV Charging Stations) టారిఫ్‌ను యూనిట్‌కు రూ.13 (జీఎస్టీ అదనం)గా నిర్ణయించినట్లు, ఒప్పంద కాలమంతా ఇదే ధర అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలోని 200 స్టేషన్లను ఆరు క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు.
సెప్టెంబర్ 7న ప్రీ-బిడ్ భేటీ.. ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు:
టెండర్ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 7న ప్రీ-బిడ్ సమావేశాలను నిర్వహించనున్నట్లు రెడ్కో అధికారులు తెలిపారు. బిడ్ల సమర్పణ ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 22న ముగుస్తుందని వెల్లడించారు. ఆసక్తిగల ప్రైవేట్ ఆపరేటర్లు తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా తమ బిడ్లను సమర్పించాలని సూచించారు.
