శరవేగంగా సచివాలయం కూల్చివేత పనులు, ముందుగా కూల్చింది వీటినే, 15 రోజుల్లో అంతా పూర్తి

  • Publish Date - July 7, 2020 / 12:28 PM IST

హైకోర్టు నుంచి అనుమతి రావడంతో హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేత పనులు షురూ అయ్యాయి. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో సోమవారం(జూలై 6,2020) అర్ధరాత్రి నుంచే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. కూల్చివేత పనులను వేగవంతం చేశారు. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసుల్ని మోహరించారు. సచివాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసేశారు. ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్ సెక్రటేరియట్ దారులను క్లోజ్ చేశారు. సచివాలయానికి కిలోమీటర్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. కూల్చివేతలో భాగంగా మొదట జీ, సి బ్లాక్ లను కూల్చివేస్తున్నారు. కూల్చివేత పనులను సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

15 నుంచి 20 రోజుల్లో కూల్చివేత ప్రక్రియ పూర్తి:
ముందుగా మధ్యలో ఉన్న భవనాలను కూల్చేస్తున్నారు. ఈ ఉదయానికి సీ బ్లాక్, రాక్ స్టోన్ బిల్డింగ్ కూల్చివేత పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇక భవన శిథిలాలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో రోడ్డువైపు ఉన్న భవనాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాత్రి సమయాల్లోనే శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. 15 నుంచి 20 రోజుల్లో కూల్చివేత ప్రక్రియ పూర్తి కానుంది.

ఇక చరిత్రే:
ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న సచివాలయ భవనం ఇక కనమరుగు కానుంది. నిజాంల కాలంలో నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ భవనం నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభం కానుంది. ఇప్పటికే సెక్రటేరియట్‌లో ఉన్న అన్ని శాఖల్ని ఇతర భవనాల్లోకి మార్చేసిన సంగతి తెలిసిందే. పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. కేబినెట్‌లో కూడా తీర్మానం చేశారు. అయితే, సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణాలను వ్యతిరేకిస్తూ అనేకమంది కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో కూల్చివేత ప్రక్రియ బాగా ఆలస్యమైంది. ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందని పిటిషన్ లో తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపిన కోర్టు వాదనల్ని సుదీర్ఘంగా వినింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఇప్పుడున్న అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. అందరి వాదనలు విన్న కోర్టు చివరకు కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాజప్రాసాదంలా ఉంది, కొత్త సచివాలయం నమూనా ఇదే:
పాత సచివాలయం భవనాల కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం అదే స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టనుంది. ఈ క్రమంలోనే నూతన సచివాలయం భవన డిజైన్ ను విడుదల చేసింది. కొత్త భవనం నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసింది. ఈ నమూనాకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ భవనం ఆరు అంతస్తుల్లో నిర్మించాలని అధికారులు డిజైన్ చేశారు. చూడడానికి రాజప్రాసాదంలా ఉన్న ఈ నమూనా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తోంది. ఏడాదిలోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది.

Read Here>>తెలంగాణ నూతన సచివాలయం ఇదే..