దశాబ్ధాల ఘనమైన చరిత్ర కలిగిన సచివాలయం రేపటి(29 సెప్టెంబర్ 2019) నుంచి మూగబోనుంది. దేశంలో ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు సందడి చేసిన సచివాలయం ఇకపై వెలవెలబోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైనా ఒక్కసారి దాని ముందు నిలబడి ఫోటో తీసుకోవాలని, అక్కడి అధికారులకు సమస్యలు చెప్పుకోవాలని అనుకునేవారు. అలా జనంతో కలకలలాడిన సచివాలయం.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కొంత కాలం బాగానే నడిచినా.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు ఇప్పుడు ఈ సచివాలయంకు తాళం వెయ్యనున్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించిన ప్రభుత్వం.. సచివాలయ ప్రాంగణం నుంచి ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని ప్రభుత్వ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంను పునర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఇప్పటికే 90 శాతానికి పైగా ప్రభుత్వ శాఖలు తమ ఫైళ్లను తరలించాయి. దీంతో చాలా బ్లాకులు ఖాళీ అవ్వగా.. సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి సచివాలయంలోని బ్లాకులను పరిశీలించారు. దీంతో ఆదివారం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళం వేసేందుకు జీఏడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో తాళం చెవులు ఉంటాయి.
1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు కాలం నాటి నుంచి ఈ సచివాలయం సేవలందిస్తుంది. 1956లో రాయలసీమ, కోస్తాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి చివరగా కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎందరో ముఖ్యమంత్రులు ఆ సచివాలయంలోనే పనిచేశారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నందమూరి తారక రామారావు లాంటి మహామహులు ఇదే సచివాలయం కేంద్రంగా పాలన కొనసాగించారు.