Kurnool Bus Accident
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 41మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రయాణికుల్లో 20మంది సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ఫోరెన్సిక్ బృందం బస్సులో నుంచి 19మృతదేహాలు వెలికి తీశారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఇదిలాఉంటే.. బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారంను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి రూ.2లక్షల పరిహారంను ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.