TG TET Notification
TG TET Notification : తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET) నిర్వహణకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలను జనవరి 3 నుంచి 31వ తేదీ మధ్య నిర్వహిస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. సమాచార పత్రాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు.
ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. 2025 ఏడాదికి సంబంధించి తొలి విడత టెట్ నోటిఫికేషన్ గత జూన్ నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేయగా.. జులై 22న ఫలితాలు సైతం వెల్లడించారు.
అయితే, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులుసైతం టెట్‌లో అర్హత సాధించాలంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో తమ ఉద్యోగాల్లో కొనసాగాలంటే టీచర్లంతా ఈ టెట్ పాస్ కావాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీరుపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లు కూడా పరీక్ష రాసుకునేలా జీవోలో సవరణ చేయాలి. దీనికితోడు గతంలో బీఈడీ విద్యార్హతతో ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలుగా ఎంపికైన వారున్నారు. ప్రస్తుతం ఎస్జీటీలకు డీఈడీ విద్యార్హత తప్పనిసరి.
ఈ క్రమంలో బీఈడీతో ఎస్జీటీలుగా ఎంపికైన వారు పేపర్ -1 రాయాలా..? పేపర్-2 రాయాలా..? అనే ప్రశ్న కూడా తలెత్తింది. దానిపై చర్చించిన ప్రభుత్వం .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్ సర్వీస్ టీచర్లతోపాటు ప్రైవేట్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సైతం టెట్ రాయొచ్చునని, బీఈడీతో ఎస్జీటీలుగా పనిచేస్తున్న వారు పేపర్ -1 రాయవచ్చునని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి గురువారం సవరణ జీవో జారీ చేశారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ జారీ అయింది.
టెట్‌లో అర్హత సాధించాలంటే.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు (40శాతం) 60 మార్కులు రావాలి. ఇక బీసీ అభ్యర్థులకు (50శాతం) 75 మార్కులు రావాలి. ఇక ఓసీ అభ్యర్థులకు (60శాతం) 90మార్కులు రావాలి. మొత్తం ఐదు విభాగాల్లో 150 మార్కులకు టెట్ పరీక్ష జరగనుంది. మొదటి విభాగంలో సైకాలజీ 30మార్కులు, 2వ విభాగంలో తెలుగు 30 మార్కులు, 3వ విభాగంలో ఇంగ్లీష్ 30 మార్కులు, 4వ విభాగంలో మ్యాథ్స్ 30 మార్కులు, ఐదో విభాగంలో సోషల్ సైన్స్ లేదా ఫిజికల్ సైన్స్ లేదా బయోలాజికల్ సైన్స్ 30 మార్కులు కలిపి మొత్తం 150 మార్కులకు అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది.