తెలంగాణ వెదర్ అలెర్ట్.. ఈ జిల్లాలకు రెండు రోజులు దబిడి దిబిడే..

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే, మరో రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

AP Rains

Telangana Rain: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. వాంగులు వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సగటున 2.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంలో గురువారం ఉదయం ఉపరితల ఆవర్తనం విలీనమైంది. దీంతో వచ్చే రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇవాళ (శుక్రవారం) అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు రెండ్రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

శనివారం (రేపు) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆది, సోమ వారాల్లోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. గురువారం సీఎంఓ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలు నమోదైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.