Anchor Swetcha Votarkar: యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం.. ఆ ఆరోపణలను ఖండించిన పూర్ణచందర్.. మీడియాకు లేఖ

స్వేఛ్చ తన జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది. పెళ్లి చేసుకోవాలనుకుంది.

Anchor Swetcha Votarkar: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ బలవన్మరణం కేసు సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు తనపై చేసిన ఆరోపణలపై పూర్ణచందర్ స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాకు లేఖ విడుదల చేశారు. స్వేచ్ఛ బలవన్మరణానికి నేనే కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు పూర్ణచందర్. తాను వేధించడం వల్లే, పెళ్లి పేరుతో మోసం చేయడం వల్లే స్వేచ్ఛ చనిపోయిందని అనడంలో నిజం లేదన్నారు. రెండుసార్లు విడాకులు తీసుకున్న స్వేచ్ఛ నిత్యం డిప్రెషన్ లో ఉండేదని చెప్పారు. స్వేచ్ఛకు ఏనాడు కూడా తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదన్నారు.

”2009 నుండి నాకు స్వేచ్ఛ స్నేహితురాలిగా పరిచయమైంది. 2020 నుండి స్వేచ్ఛ నాకు దగ్గరైన మాట వాస్తవమే. స్వేచ్ఛకు ఏనాడు కూడా తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు. తల్లిదండ్రులతో ఉండలేకపోయిన స్వేచ్ఛ 2020లో బయటకు వచ్చేసి వేరుగా ఉంటోంది. 2022 నుంచి స్వేచ్ఛ కూతురి బాధ్యతను నేను పూర్తిగా తీసుకున్నా. ఆమె చదువు, ఆమెకు కావాల్సిన అన్ని అవసరాలను దాదాపు ఒక తండ్రి స్థానంలో బాధ్యత తీసుకున్నా.

ఆమె ఎంతో డిప్రెషన్ లో ఉండేది, గత ఐదేళ్లు ఎన్నోసార్లు ఆసుపత్రికి తీసుకెళ్లా. మెడికల్ రిపోర్టులన్నీ కవాడిగూడలోని తన రూమ్ లో ఉన్నాయి. రెండుసార్లు విడాకుల తర్వాత ఆమె పూర్తిగా డిప్రెషన్ లో ఉంటోంది. స్వేచ్ఛ, ఆమె కూతురు ఇద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నా. స్వేచ్ఛ కూతురిని నేనే చదవిస్తున్నా. ఫీజులు కూడా కడుతున్నా. స్వేచ్ఛతో నాకు ఎలాంటి విబేధాలు లేవు.

Also Read: తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందరే అంటూ ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు.. పోస్టుమార్టం పూర్తి..

ఘటనకు ముందు రోజు స్వేచ్ఛ తండ్రి ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను బాధపెట్టేలా మాట్లాడారు. రెండేళ్లకు ఒకసారి ఒక మనిషిని తీసుకొచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుందన్నారు. నాకు డబ్బు లేకపోవచ్చు.. కానీ పీడీఎస్ యూలో పని చేశాను, గౌరవాన్ని కోల్పోను. అని స్వేచ్ఛ వాళ్ల నాన్న అన్న మాటలు ఆమె ఎంతగానో బాధించాయి. ఇదంతా నాతో చెప్పుకుని ఏడ్చింది.

స్వేఛ్చ తన జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని ఇచ్చాను. స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది. పెళ్లి చేసుకోవాలనుకుంది. నేను ఏ రోజూ ఆమె చావును కోరుకోలేదు. మీడియా ముందు ఆమె తల్లిదండ్రులు, బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్దం. పెళ్లి పేరుతో ఆమెను మోసం చేయలేదు, ఒత్తిడి చేయలేదు. చిన్నప్నటి నుంచి ఆమెను ఆవహించిన ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు. పోలీసులు నా కుటుంబసభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. నేను నిర్దోషిని, కోర్టుల్లో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు. అందుకే మీడియాను ఆశ్రయించాను” అని లేఖలో తెలిపారు పూర్ణచందర్.