Telangana Group-1 : తెలంగాణ గ్రూప్-1 పిటీషన్ల‌పై హైకోర్టు సంచలన తీర్పు.. రిజల్ట్స్ రద్దు..!

Telangana Group-1 exams : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది.

Telangana High Court

Telangana Group-1 exams : తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఇప్పటివరకు ప్రకటించిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ తీర్పునిచ్చిన హైకోర్టు.. పరీక్షల పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ చేసిన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని TGPSC కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. ఎనిమిది నెలల్లో ప్రాసెస్ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిన అభ్యర్థులకు చుక్కెదురైనట్లయింది.

Also Read: Bathukamma Sarees : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఈసారి వారికి మాత్రమే బతుకమ్మ చీరలు.. ఆ ప్రాంతంలో వచ్చేవారం పంపిణీ..

గ్రూప్ -1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారు మూల్యాంకనాన్ని కోర్టులో సవాల్ చేశారు. మెయిన్స్ జవాబు పత్రాలు పున: మూల్యాంకనం చేయాలని, లేదా మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పిటిషన్లలో హైకోర్టును కోరారు.

మరోవైపు.. ఎంపిక ప్రక్రియ పూర్తయినందున రద్దు చేయొద్దని మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని ఒక్కటిగా విచారించిన హైకోర్టు జులై 7న వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వే చేసింది.

ఇప్పటికే గ్రూప్-1 పరీక్షల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ హైకోర్టులో కేసు విచారణ దృష్ట్యా కమిషన్ నియామక ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే, గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన పిటిషన్లపై తాజాగా హైకోర్టు తీర్పు వచ్చింది. అవకతవకలకు తావు లేకుండా రీవాల్యూయేషన్ జరిపించాలని టీజీపీఎస్‌సీను హైకోర్టు ఆదేశించింది.

రీ వాల్యూయేషన్ జరిపించిన తరువాతనే వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని సూచించింది. అలా సాధ్యంకాని పక్షంలో మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్‌సీ కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.