మహిళల సమస్యలపై జట్‌ స్పీడ్‌లో కమిషన్ నిర్ణయాలు.. కేటీఆర్‌, వేణుస్వామి విషయంలో వేగంగా స్పందన

మహిళలపై అఘాయిత్యాలు, ఇతర అంశాలపై మహిళా కమిషన్ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నా..

తెలంగాణ మహిళా కమిషన్ రాజకీయ కాక పుట్టిస్తోంది. మహిళలపై జరుగుతున్న దారుణాలపై అత్యంత వేగంగా స్పందిస్తున్న కమిషన్…. రాజకీయ విమర్శలపైనా అంతే సీరియస్‌గా వ్యవహరిస్తుండటం చర్చకు తావిస్తోంది… కొన్ని అంశాల్లో సుమోటాగా స్పందించడం ద్వారా కమిషన్ జోరు చూపిస్తున్నా… ఇదే సమయంలో అధికార పార్టీ చేతికి కమిషన్ అస్త్రంగా మారుతోందంటూ ప్రతిపక్షం ఆరోపణలకు కారణమవుతోంది… ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత? మహిళా కమిషన్ పనితీరు ఎలా ఉంది…

తెలంగాణ మహిళా కమిషన్ యాక్టివిటీస్‌పై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరళ్ల శారద బాధ్యతలు స్వీకరించాక… మహిళామణుల సమస్యలపై జట్ స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలకు అనేక అంశాల్లో అండగా నిలుస్తూ అవేర్ నెస్ కల్పించడంతోపాటు… బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంపై ప్రశంసలు అందుకుంటున్నారు.

ఇదే సమయంలో సున్నితమైన రాజకీయ అంశాలపై సుమోటోగా స్పందించడం విమర్శలకు తావిస్తోంది. దీంతో మహిళా కమిషన్ అధికార కాంగ్రెస్‌కు అస్త్రంగా మారిందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. ఏకంగా తమ వర్కింగ్ ప్రెసిడెంట్‌నే మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద టార్గెట్ చేస్తూ నోటీసులు ఇవ్వడాన్ని గులాబీదళం జీర్ణించుకోవడం లేదు.

మహిళల ప్రశంసలు
తెలంగాణ మహిళా కమిషన్ గా నేరెళ్ల శారద గత నెల జులై 17న బాధ్యతలు స్వీకరించారు. సరిగ్గా ఈ నెలరోజుల్లో పలు అంశాలపై వేగంగా స్పందిస్తూ ఎంతో మంది మహిళల ప్రశంసలు అందుకున్నారామె. హైదరాబాద్ మలక్ పేట్ లో అంధ బాలికపై అత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్… ఆ అమానుషమైన సంఘటనపై తక్షణమే విచారణకు ఆదేశించి శబాష్ అనిపించుకున్నారు.

మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ ఘటనపైనా మహిళా కమిషన్ సీరియస్‌గానే రియాక్ట్ అయ్యింది. స్వయంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద బాధితురాలిని పరామర్శించి, బాధితురాలికి భరోసాగా ఇవ్వడమే కాకుండా తక్షణ న్యాయం దిశగా చర్యలు చేపట్టారు

ఇదే సమయంలో ఎవరూ టచ్ కూడా చేయని సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి విషయంలోను వేగంగా స్పందించింది మహిళా కమిషన్ . అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహ నిశ్చితార్ధంపై వేణుస్వామి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కొత్త జంట వైవాహిక జీవితంపై వేణుస్వామి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కొందరు జర్నలిస్టులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద… వేణుస్వామికి నోటీసులిచ్చింది.

వేణు స్వామి తన అడ్వకేట్ ద్వారా మహిళా కమిషన్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసినా… వారికి చైర్ పర్సన్ సమయం కూడా ఇవ్వనట్లు తెలుస్తోంది. స్వయంగా వేణుస్వామి కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని అడ్వకేట్లకు తేల్చిచెప్పారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

స్పీడ్‌గా రియాక్ట్
ఇక మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అంతే స్పీడ్‌గా రియాక్ట్ అయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఈ మధ్య అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీనిపై సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ విచారం వ్యక్తం చేసి, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా, కమిషన్ మాత్రం కరుణించలేదు.

కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి… ఈ నెల 20న తన ముందు హాజరుకావాలని ఆదేశించడం రాజకీయంగా కాక పుట్టిస్తోంది. ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉండటం… ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే చెందిన నేరెళ్ల శారద మహిళా కమిషన్ చైర్మన్ గా ఉండటమే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతగా సుదీర్ష కాలం రాజకీయాలు చేసిన నేరెళ్ల శారద.. కావాలనే కేటీఆర్ ను టార్గెట్ చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక మహిళా కమిషన్‌ నోటీసులకు స్పందించకూడదని తొలుత కేటీఆర్‌ భావించినా, చట్టబద్ధ కమిషన్‌ను గౌరవించాలనే ఆలోచనతో 24న కమిషన్‌ ముందుకు హాజరవుతానని ప్రకటన చేయడం కూడా ఆసక్తిరేపుతోంది.

మహిళలపై అఘాయిత్యాలు, ఇతర అంశాలపై మహిళా కమిషన్ నిష్పక్షపాతంగానే వ్యవహరిస్తున్నా.. రాజకీయపరమైన అంశాల్లో స్పందిస్తున్న తీరు మాత్రం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. గతంలో ఎప్పుడూ ఇంతలా మహిళా కమిషన్లు పనిచేయలేదని, ఇప్పుడు రాజకీయ అంశాల్లో కలుగజేసుకోవడం వెనుక సర్కార్ వ్యూహం ఉందన్న అనుమానాలూ విపక్షాలను వెంటాడుతున్నాయి.

మహిళా కమిషన్ ను కూడా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు అస్త్రంగా రేవంత్ సర్కార్ వాడుకుంటుందంటూ చైర్ పర్సన్ నేరెళ్ల శారదపై సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తోంది గులాబీదళం. ఇదే సమయంలో కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసు పెట్టడం కూడా ఇప్పుడు రాజకీయాన్ని మరింత రాజేసింది.

Also Read: అక్కడి రాజకీయాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు.. ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్

ట్రెండింగ్ వార్తలు