TGSRTC announces special tour package to Arunachalam
TGSRTC Special Tour : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనేక మంది భక్తులు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా కార్తీక పూర్ణమి రోజున పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
కార్తీక పూర్ణిమ నాడు అరుణాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు భక్తులకు టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో అరుణాచలం గిరి ప్రదక్షిణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు.
అంతేకాదు.. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సహా తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్సులు కార్తీక పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా నవంబర్ 13న ఆయా ప్రాంతాల నుంచి బయలుదేరి నవంబర్ 15న అరుణాచలం చేరుకుంటాయి.
టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. గిరి ప్రదక్షిణ కోసం పవిత్ర ప్రదేశమైన అరుణాచలం చేరుకోవడానికి ముందు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీ అపూర్వ అవకాశాన్ని కల్పిస్తోందని తెలిపారు. భక్తులు (TGSRTC) అధికారిక వెబ్‌సైట్ (http://www.tgsrtcbus.in) ద్వారా ఆన్‌లైన్‌లో ప్యాకేజీ కోసం తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం లేదా ఎంక్వైరీల కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్‌ని 040-23450033 లేదా 040-694400000 నంబర్‌లో సంప్రదించండి.
Read Also : Shiv Nadar Top : దాతృత్వంలో మరోసారి శివనాడార్ టాప్.. టాప్ 10 జాబితాలో ఎవరెవరంటే?