The Dri Focused On The Heavily Seized Gold On The Outskirts Of Hyderabad
The DRI focused on the heavily seized gold : హైదరాబాద్ నగర శివార్లలో భారీగా పట్టుబడ్డ బంగారం వ్యవహారంలో అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. తమిళనాడులో ఎన్నికల కోసం ఈ బంగారం రవాణా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయినప్పటికీ దీన్ని హైదరాబాద్ ఎందుకు తెస్తున్నారు? ఎవరికి ఇవ్వబోతున్నారు? వంటి అంశాలపై స్పష్టత రావలసి ఉంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు మంగళవారం రూ.11.63 కోట్ల విలువైన 25 కిలోల బంగారం పట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఒకేసారి ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే మొదటిసారి.
కారులో ప్రయాణికుల రక్షణ కోసం ఏర్పాటు చేసే ఎయిర్‌బ్యాగ్‌లను తొలగించి, అక్కడ బంగారం దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. కారు దొరికినప్పటికీ అందులో దాచిపెట్టిన బంగారాన్ని పట్టుకోవడానికి అధికారులు నానాపాట్లు పడాల్సి వచ్చింది. అస్సాం రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారు పశ్చిమబెంగాల్‌లో బయలుదేరి, రెండు రాష్ట్రాలు దాటుకొని తెలంగాణకు వచ్చింది. పశ్చిమబెంగాల్‌లో కూడా ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి వాహనాల తనిఖీ ఉంటుంది. అయినా ఎక్కడా ఈ వాహనానికి అడ్డంకి ఎదురుకాకపోవడం గమనార్హం. కానీ కచ్చితమైన సమాచారం మేరకు హైదరాబాద్ డీఆర్‌ఐ అధికారులు పట్టుకోగలిగారు.
బంగారం అక్రమ రవాణాలో ఎప్పుడూ అనుసరించే వ్యూహాన్నే నిందితులు ఇప్పుడు కూడా అమలు చేశారు. పట్టుబడ్డ ముగ్గురినీ డీఆర్‌ఐ అధికారులు ఎన్నిరకాలుగా ప్రశ్నించినా సరైన సమాచారం రాకపోవడమే ఇందుకు కారణం. కోల్‌కతాలో తమకు బంగారం ఎవరు ఇచ్చారో సరిగా చెప్పలేకపోతున్నారని, అలానే హైదరాబాద్‌లో ఎవరికి ఇవ్వాలో కూడా తెలియదని చెబుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి ఇవ్వాలో ఫోన్లో చెబుతామని దీన్ని అప్పజెప్పినవారు ఆదేశించారని డ్రైవర్లు వెల్లడించినట్లు సమాచారం. బంగారం, మత్తుమందుల రవాణాలో ఇచ్చినవారు, రవాణా చేసిన వారు, దాన్ని స్వీకరించాల్సిన వారు… ఈ ముగ్గురిలో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
వీరిలో ఏఒక్కరు పట్టుబడ్డా మిగతా వారి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. అందుకే పట్టుబడ్డ ముగ్గురు డ్రైవర్లను ఎన్నిరకాలుగా ప్రశ్నిస్తున్నా హైదరాబాద్‌లో దాన్ని తీసుకోవాల్సిన వారు ఎవరన్నదానిపై స్పష్టత రావడంలేదు. అయితే తమకు ఎవరు అప్పగించారన్న దానిపై కొంత సమాచారం వచ్చినట్లు తెలిసింది. తమిళనాడు ఎన్నికల కోసమే ఈ బంగారం రవాణా చేస్తున్నట్లు భావిస్తున్నారు. బంగారాన్ని డబ్బు రూపంలోకి మార్చి ఎన్నికల ఖర్చులకు వాడుకోవాలన్నది వ్యూహం. అరెస్టు చేసిన ముగ్గురు డ్రైవర్లను కోర్టు అనుమతితో మళ్ళీ అదుపులోకి తీసుకొని విచారించాలనే ఆలోచనతో డీఆర్‌ఐ అధికారులు ఉన్నారు.