ఈ మెసేజ్ 20 మందికి పంపించండి అని వచ్చిందా ? అలా చేశారో బుక్ అయిపోతారు

The new trend of online fraudsters : ఈ మెసేజ్ 20 మందికి పంపించండి…ఇలా చేయడం వల్ల మంచి గిఫ్ట్ వస్తుందని..తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే..బహుమతులు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ఎవరైనా ఫోన్ లో చెప్పినా..మెసేజ్ చేసినా..వెంటనే రెస్పాండ్ కావొద్దని ప్రజలకు సూచిస్తున్నారు పోలీసులు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని తాము అడిగే సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంఐ 11 టీ మొబైల్‌ ఫోన్‌ గెలుచుకోవాలంటూ గాలం వేసి, మొబైల్ ఫోన్లలో డేటాను తస్కరిస్తున్నారు. ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ వస్తే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు చెప్పే యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవద్దని, ఫోన్ కాల్స్ కు సంబంధించి..వాళ్లు చెప్పిన విధంగా చేస్తే…బ్యాంకు లావాదేవీలు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళుతాయని హెచ్చరించారు. ఆన్ లైన్ కేటుగాళ్లు కొత్త కొత్త విధానాలు ఎంచుకుంటున్నట్లు, వీళ్లు లింకులు పంపి..వాట్సాప్ గ్రూపుల ద్వారా..20 మంది స్నేహితులకు పంపాలని మెసేజ్ లు పంపుతారని వెల్లడించారు. ఇలాంటి వాటికి అస్సలు స్పందించవద్దని, డేటా చోరీకి సంబంధించి అనేక కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు.