మహిళను కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా కొట్టారు

  • Publish Date - November 12, 2020 / 01:29 PM IST

The woman was tied up and beaten badly : ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాకలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న షేక్‌ నాగుల్‌ దుర్గా బీ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు.. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి మరీ కొట్టారు. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దుర్గాబీ అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుర్గాబీను ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక గ్రామానికి చెందిన షేక్ నాగుల్ దుర్గాబీకు ఇరవై సంవత్సరాల క్రితం షేక్ నాగుల్‌ మీరా సాహెబ్‌తో వివాహం జరిగింది. అయితే వ్యాపారంలో నష్టం రావడం, కుటుంబ కలహాలతో భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు.. అయితే కొన్ని నెలల క్రితం ఆస్తి పంపకాలు జరపాలని పినపాక గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది దుర్గాబీ.



పోలీసులు నచ్చజెప్పి కుటుంబ సమస్యలు పెద్ద మనుషుల ద్వారా చర్చించుకోవాలని చెప్పి పంపడంతో గొడవలు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న దుర్గా బీ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆమెను తాళ్ళతో కాళ్లూ చేతులు కట్టేసి గాయపరచటం పలు అనుమానాలకు తావిస్తోంది.