Zoological Park
Nehru Zoological Park: హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న వారేకాక.. శివారు జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు నెహ్రూ జూ పార్కు సందర్శనకు వెళ్తుంటారు. ఎక్కువగా ఆదివారం, వరుస సెలవుల రోజుల్లో నెహ్రూ జూ పార్కు వద్ద సందడి వాతావరణం ఉంటుంది. పిల్లలను, కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని కుటుంబసమేతంగా జూ పార్కు సందర్శనకు వెళ్తుంటారు. అయితే, ఇకనుంచి నెహ్రూ జూ పార్కుకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి. అదేమిటంటే.. జూ పార్కు ఎంట్రీ, ఇతర సర్వీసుల ధరలు మార్చి 1వ తేదీ నుంచి భారీగా పెరుగుతున్నాయి. ఈ మేరకు 13వ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది.
2023మేలో నెహ్రూ జూ పార్కు ఎంట్రీ, ఇతర సర్వీసుల ధరలను పెంచారు. తాజాగా మళ్లీ రెండేళ్ల తరువాత ధరలు పెరిగాయి. వేసవి కాలం వస్తుండటంతో విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో జూ పార్కుకు వెళ్లే సందర్శకుల సంఖ్య పెరగనుంది. పిల్లలు, పెద్దలు జంతువులను చూడడానికి క్యూ కడతారు. దీంతో ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జూపార్కు ఎంట్రీ ఫీజు సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.70, వీకెండ్స్ లో రూ. 80 ఉంది. సవరించిన ధరల ప్రకారం.. మార్చి 1వ తేదీ నుంచి సాధారణ రోజులు, వీకెండ్స్ అనే తేడాలేకుండా పెద్దలకు రూ. 100 ఫిక్స్ చేశారు. అలాగే పిల్లలకు రూ. 50 చేశారు.
ప్రస్తుతం ధరలు.. పెరిగిన ధరలు ఇలా..
♦ మూవీ షూటింగ్ కెమెరాను ప్రొఫెషనల్ వీడియో కెమెరాగా ట్రీట్ చేసి ప్రస్తుతం రూ. 600 తీసుకుంటున్నారు. మార్చి 1వ తేదీ నుంచి మూవీ షూటింగ్ కెమెరాకు రూ.10వేలు వసూలు చేయనున్నారు.
♦ కెమెరా తీసుకెళ్తే ప్రస్తుతం రూ. 100 వసూలు చేస్తుండగా.. ఇక నుంచి రూ. 150 వసూలు చేయనున్నారు.
♦ ప్రొఫెషనల్ వీడియో కెమెరాకు ప్రస్తుతం రూ.600 వసూళ్లు చేస్తుండగా.. మార్చి 1వ తేదీ నుంచి సవరించిన ధరల ప్రకారం రూ. 2500 తీసుకోనున్నారు.
♦ టాయ్ ట్రైన్ రైడ్ గతంలో పెద్దలకు రూ. 45, పిల్లలకు రూ. 25 ఉండగా.. ఇకనుంచి పెద్దలకు రూ. 80, పిల్లలకు రూ. 40 తీసుకోనున్నారు.
♦ 14 సీటర్ న్యూ బీవోవీ.. పెద్దలకు, పిల్లలకు రూ. 4వేలు (60 నిమిషాలు) వసూలు చేయనున్నారు.
♦ ఫిష్ ఆక్వేరియంకు ప్రస్తుతం రూ. 10 వసూళ్లు చేస్తుండగా.. మార్చి 1 నుంచి రూ. 20 వసూళ్లు చేయనున్నారు.
♦ సఫారీ పార్క్ డ్రైవ్ కోసం ప్రస్తుతం పెద్దలకు రూ. 80, పిల్లలకు రూ. 45 తీసుకుంటుండగా.. మార్చి 1 నుంచి పెద్దలకు, పిల్లలకు రూ. 100 చొప్పున వసూళ్లు చేయనున్నారు.
♦ ఏసీ సఫారీ బస్ కోసం ప్రస్తుతం రూ. 120 వసూళ్లు చేస్తుండగా.. మార్చి 1 నుంచి రూ. 150 వసూళ్లు చేయనున్నారు.