రహదారిపై పెద్దపులి సంచారం…భయాందోళనలో ప్రజలు

  • Publish Date - October 13, 2019 / 02:35 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్‌లో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకసారి రహదారిమీద, ఇంకోసారి పంటచేల వద్ద, మరోసారి గ్రామ సమీపంలో పెద్దపులి భయ పెడుతోంది.. ఆ రహదారిమీద వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తోంది. ఎవరిపై దాడి చేస్తుందో అన్న భయంతో స్థానికులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు.

పెద్దపులి పెంచికల్ పేట్, బెజ్జూర్ మండలాల్లో పెద్దపులి సంచరిస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. గత నెల 27న పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామ సమీపంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో… ప్రధాన రహదారి పైకి పెద్దపులి వచ్చింది. తర్వాత మళ్ళీ పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.ఇక వారం రోజుల క్రితం బెజ్జూర్‌ మండలం సులుగుపల్లి లో ఒక రైతు చేనులో పెద్దపులి కనిపించింది. తాజాగా శుక్రవారం పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గొల్లదేవ్ సమీపంలో పెద్ద పులి కనిపించడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

పెంచికల్ పేట్, బెజ్జార్ మండలాల్లో తరచూ పులి కనిపిస్తుండటంతో ప్రజలు భయ పడుతున్నారు.. ఏ క్షణం ఎవరిపై దాడి చేస్తుందో తెలియక బాటసారులు ఆందోళన చెందుతున్నారు. పెంచికల్ పేట్ – బెజ్జూర్ ప్రధాన రహదారిపై ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఇక సమీపంలో గ్రామాల ప్రజలు పులి ఎప్పుడు తమ గ్రామాలపై పడుతుందో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. 
 

ట్రెండింగ్ వార్తలు