అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. కాగా, ఇప్పటి వరకు తనిఖీల్లో 600 కోట్ల రూపాయలకు పైగా సొత్తును సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 214కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. 94 కోట్ల రూపాయల విలువ చేసే మద్యం సీజ్ చేశారు. 34 కోట్ల రూపాయల విలువగల డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 179 కోట్ల రూపాయల విలువచేసే బంగారం, వెండి లాంటి వస్తువులు పట్టుకున్నారు. 78 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం, చీరలు, మొబైల్స్ లాంటివి పోలీసులు సీజ్ చేశారు.
ఇకపోతే, శనివారం హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తాము నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7 కోట్ల 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో భాగంగా ఆరు కార్లలో ఈ డబ్బును తరలిస్తుండగా పట్టుబడినట్లు వారు పేర్కొన్నారు. ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చనప్పటి నుంచి లెక్కలు లేని డబ్బు ఇలా పెద్ద మొత్తంలో పట్టుబడుతోంది. ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకోవడం ఇదే తొలిసారి.