Mahesh Kumar Goud
Mahesh Kumar Goud: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దాదాపు 40 ఏళ్ల పాటు పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ ఆయనకు రావాల్సిన గుర్తింపు రాలేదా? ఈ ప్రశ్నకు ఆయనే స్వయంగా సమాధానం చెప్పారు.
ఇవాళ 10టీవీ పాడ్‌కాస్ట్‌లో మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) మాట్లాడారు. “రాజకీయాల్లో ఎంత కష్టపడ్డ అదృష్టం కలిసి రావాలి. ఆవగింజంత అదృష్టం తగలనిదే ముందుకు పోలేం. నేను రాజకీయాల్లోకి రావడానికి డి.శ్రీనివాస్ కారణం.
ఆ తర్వాత ఆయనే కొన్ని కారణాల వల్ల అడ్డుతగిలారు. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో సాధించినదాని కన్నా పోగొట్టుకుంది ఎక్కువ. యవ్వనం పోయింది.. ఆస్తులు పోయాయి. పీవీ నరసింహారావు, విజయ భాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి ముగ్గురి సహకారంలో నాకు 27 ఏళ్లప్పుడే అసెంబ్లీ సీట్ టికె్ వచ్చింది. డిచ్‌పల్లి పోవాల్సి వచ్చింది.
ఓడిపోయినా 30 వేల ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1999లో నేను 100 శాతం గెలవాల్సి ఉంది. అంతకుముందు మొత్తం దృష్టి అంతా డిచ్‌పల్లిపైనే పెట్టాను. నామినేషన్ వేసే సమయంలో సీటు మార్చారు. 2014లో నిజామాబాద్ అర్బన్‌లో ఎంఐఎం గట్టిగా పోటీ ఇచ్చింది.
కాంగ్రెస్‌కు పడాల్సిన ఓట్లు ఎంఐఎంకు పడ్డాయి. కేసీఆర్ సీట్లు గెలవాలి కాబట్టి అక్కడ ఎంఐఎం అభ్యర్థిని పెట్టారు. ఎంఐఎం రెండో స్థానానికి వచ్చింది. 2021లో పార్టీ పరంగా బ్రేక్ వచ్చింది. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిని అయ్యాను. రాష్ట్ర నాయకత్వం అంతా నాకే సపోర్టు చేసింది. భగవంతుడు గొప్పోడు.. ప్రెసిడెంట్ పదవే ఇచ్చాడు” అని చెప్పారు.