Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్.. తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్.. మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపిన కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)తొలిసారిగా నోరు విప్పారు.

TPCC Chief Mahesh Kumar Goud sensational comments on Konda Surekha dismiss

  • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
  • కూతురి వ్యాఖ్యలను ఖండించకపోవడమే కారణం
  • బీసీలకు పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్

Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపిన కొండా సురేఖ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)తొలిసారిగా నోరు విప్పారు. సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం పార్టీ పరంగా బాధాకరమైన విషయమే అయినప్పటికీ, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినప్పుడు ఇటువంటి కఠిన చర్యలు తప్పవని ఏఐసీసీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆయన తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను లేదా ఏవైనా అసంతృప్తులను చర్చించుకోవడానికి అనేక వేదికలు అందుబాటులో ఉన్నాయని, అలా కాకుండా బహిరంగ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని తప్పు అవుతుందని పేర్కొన్నారు. ఎవరైనా క్రమశిక్షణ దాటితే చర్యలు కచ్చితంగా ఉంటాయని హెచ్చరించారు.

RTC Bus Accident: నడిరోడ్డుపై ఆర్టీసీ బస్సు బోల్తా.. అక్కడికక్కడే డ్రైవర్ మృతి.. కామారెడ్డిలో ఘోర ప్రమాదం

కూతురి వ్యాఖ్యలను ఖండించకపోవడమే కారణం:

కొండా సురేఖ తన కుమార్తె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాల్సి ఉండిందని, అయితే ఆమె ఆ పని చేయకపోవడాన్ని ఏఐసీసీ తీవ్రంగా పరిగణించిందని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా సంఘం సమగ్రంగా విచారించి ఇచ్చిన నివేదిక ఆధారంగానే హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవరినీ బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణ తమకు ప్రాధాన్యత కాదని, రాబోయే అసెంబ్లీ సమావేశాలు, అందులో జరిగే ప్రజా సమస్యల చర్చలే పార్టీకి అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు.

బీసీలకు ప్రాధాన్యంపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది:

కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని తాము బలంగా కోరుకుంటున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే క్రమశిక్షణా చర్యలు తీసుకునే సమయంలో కులాలు, మతాలు లేదా ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకోలేమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందని, భవిష్యత్తులో కూడా బీసీ నాయకులకు మరింత పెద్దపీట వేయాలనే ఆలోచన ఏఐసీసీ హైకమాండ్ వద్ద ఉందని తెలిపారు. పార్టీ బలోపేతానికి, క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.