ఆధారాలు చూపించమంటే పారిపోయారు.. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై సామ రామ్మోహన్ రెడ్డి సెటైర్లు

ఠాగూర్, ఠాక్రేను ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Sama Ram Mohan Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షిపై బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీపాదాస్ మున్షిపై చేసిన ఆరోపణలను ఆధారాలు చూపాలని కోరితే ప్రభాకర్ పారిపోయారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో నేతలకు పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు దీపాదాస్ మున్షి బెంజ్ కార్లు గిఫ్ట్ తీసుకుంటున్నారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఇన్‌చార్జులుగా పనిచేసిన మాణిక్యం ఠాగూర్, మాణిక్‌రావ్‌ ఠాక్రే కూడా ఇదేవిధంగా వ్యవహరించారని.. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వారిని తొలగించిందని వ్యాఖ్యానించారు. ఠాగూర్, ఠాక్రేను ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలపై సామ రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని అకస్మాత్తుగా పీకేయడానికి కారణం చెప్పాలని బీజేపీని డిమాండ్ చేశారు. లిక్కర్ కుంభకోణం దోషులని అరెస్ట్ చేసి కల్వకంట్ల కవితని వదిలేశారని.. చార్జిషీటులో ఆమె పేరు ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం ముందు బీజేపీ దోషులుగా నిలబడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ఆర్థికంగా ఏమి చేయమన్న బీజేపీకి ఓటు రూపంలో శిక్ష తప్పదని రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: ఆమెకు గిఫ్ట్ ఇచ్చిన నేతలు స్పందిస్తే సమాధానం చెబుతా.. ఎన్వీఎస్ఎస్

ట్రెండింగ్ వార్తలు