బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం విప్లవాత్మక అడుగు : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు అని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

PCC President Mahesh Kumar Goud

PCC President Mahesh Kumar Goud : స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం పంచాయితీరాజ్ చట్టం-2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండల యూనిట్ గా, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్ గా, జడ్పీచైర్ పర్సన్లకు రాష్ట్ర యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని అన్నారు.

Also Read: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం కోటాపై కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి కీలక కామెంట్స్..

42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక అడుగు. ప్రభుత్వం క్యాబినెట్‌లో బీసీ రిజర్వేషన్లు అమలుకోసం ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయం తీసుకోవడం స్వాగతిస్తున్నాం. 2018 చట్టాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సామాజిక విప్లవానికి నాంది అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చేసిన డిమాండ్‌ను దేశంలో మొదటగా అమలు చేస్తున్నాం. 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి వర్గానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా. తెలంగాణ సమాజం, ప్రధానంగా బీసీలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.