Traffic Restrictions In Hyderabad : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 (సోమవారం) నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) జరగనుంది. ఈ సందర్భంగా ఆయా మార్గాల్లో సాయంత్రం 4గంటల నుంచి అర్థరాత్రి వరకు వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాబోయే 45 రోజులపాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
సిద్ధిఅంబర్ బజార్, జాంబాగ్ ల వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలనుకునే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, భారీ వాహనాలు ఎంజే మార్కెట్ వద్ద అబిడ్స్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
పోలీసు కంట్రోల్ రూమ్, బషీర్ బాగ్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ (బషీర్ బాగ్) కూడలి నుంచి అబిడ్స్ వైపు పంపిస్తారు.
బేగంబజార్ ఛత్రీ నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ, ఇతర వాహనాలు అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం, ఏక్ మినార్ మసీదు, నాంపల్లి వైపు వెళ్లాల్సి ఉంటుంది.
దారుస్సలాం (గోషామహల్ రోడ్డు) నుంచి అఫ్జల్ గంజ్, అబిడ్స్ వైపు వెళ్లాలనుకునే డీసీఎం వాహనాలతో సహా భారీ, ఇతర వాహనాలు అలాస్కా జంక్షన్ నుంచి బేగంబజార్, సిటీ కాలేజీ, నయా పూల్ వైపు మళ్లిస్తారు.
మూసాబౌలి/బహదూర్ పుర పాతబస్తీ నుంచి నాంపల్లి వైపు వెళ్లాలనుకునే ఆర్టీసీ బస్సులతో సహా ఇతర వాహనాలు సిటీ కళాశాల వద్ద నయాపూల్, ఎంజే మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.