Sangareddy District : భార్యను కాపురానికి పంపడం లేదని రూ.5లక్షలు ఇచ్చి.. దారుణానికి పాల్పడిన వ్యక్తి..
Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. భార్యను కాపురానికి పంపించడం లేదని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు.
- Harish Thanniru
- Updated on- October 13, 2026 / 10:49 AM IST
Sangareddy District
Sangareddy District : సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యను కాపురానికి పంపించడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి రూ.5లక్షల సుపారీ ఇచ్చి ఏకంగా మామనే (భార్య తండ్రి) హత్య చేయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ జిల్లా బంటారం గ్రామానికి చెందిన బసవరాజ్‌కు సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. కొద్దికాలంగా ఆమె కాపురానికి వెళ్లడం లేదు. అంతేకాకుండా భరణం కింద భర్త బస్వరాజ్ ఆస్తిలో సగం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో కేసు వేయడం, భార్య వైపు నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అల్లుడు బస్వరాజ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. తన భార్య కాపురానికి రాకపోవడానికి ఆమె తండ్రి, ఆటో డ్రైవర్ అయిన శ్రీనివాస్ కారణమని అతనిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో అతన్ని హత్యచేసి.. భార్యను కాపురానికి తెచ్చుకోవాలని ప్లాన్ వేశాడు.
బంటారం గ్రామానికి చెందిన జడల రమేశ్, జడల సుభాష్, పరిగి మురళిని కలిసి తన మామను హత్య చేయాలని బస్వరాజ్ కోరాడు. ఇందుకు రూ.5లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేయడంతో అందుకు బసవరాజ్ ఒప్పుకున్నాడు. ఒప్పందం ప్రకారం.. శ్రీనివాస్ ను హత్య చేసేందుకు సుఫారీ తీసుకున్న వ్యక్తులు ప్లాన్ సిద్ధం చేశారు. ప్లాన్ ప్రకారం.. ప్యాసింజర్లుగా శ్రీనివాస్ ఆటో ఎక్కారు. తూంకుంట గ్రామ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి.. మృతదేహంపై, ఆటోపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా.. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కారణంతోనే సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్లు నిందితుడు ఒప్పుకోవడంతో అతనితోపాటు.. సుఫారీ తీసుకున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
