AP Telangana Rain Alert : ఏపీ వైపు అల్పపీడనం.. 3 రోజుల పాటు భారీ వర్షాలు, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు!
AP Telangana Rain Alert : ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు, గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన ఉండగా, తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగనుంది.
Andhra Pradesh Rain Alert
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..
- మూడు రోజుల పాటు వర్షాలు, బలమైన గాలులు
- బంగాళాఖాతంలో అల్పపీడనం..
- కోస్తాంధ్ర, రాయలసీమకు వర్ష సూచన
- ఏపీలో వానలు.. తెలంగాణలో పొడి వాతావరణం
Andhra Pradesh Rain Alert : ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ పరిణామంతో ఏపీ, యానాం ప్రాంతాల్లో వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు :
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో దిగువ వాతావరణ పొరల్లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కురిసే సూచనలు ఉన్నాయి.
ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమలో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా వానలు పడవచ్చని అధికారులు వెల్లడించారు. ఎల్లుండి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గంటకు 50 కి.మీ వేగంతో గాలులు :
తీరప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 50 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. ఈదురుగాలుల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలంగాణలో పొడి వాతావరణం :
మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు పెద్దగా కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గనుంది.
దీంతో తెలంగాణ అంతటా పొడి వాతావరణం కొనసాగే సూచనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్తుండగా, దక్షిణ ద్వీపకల్పంలో మరో రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల వర్షాలు ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
