Trainee IPS Uday Krishna Reddy Case : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు. జుట్టు పట్టుకొని గదిలోకి లాక్కెళ్లి..
Trainee IPS Uday Krishna Reddy Case : ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనలో మార్పు రావడంతో బాధితురాలు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన కృష్ణారెడ్డి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
- Harish Thanniru
- Updated on- July 30, 2026 / 10:05 AM IST
Trainee IPS Officer Uday Krishna Reddys Case Updates
Trainee IPS Uday Krishna Reddy Case : మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం అతన్ని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అయితే, అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కృష్ణారెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ తుదితీర్పు వచ్చే వరకు తనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే, పోలీసుల విచారణ సందర్భంగా కృష్ణారెడ్డి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పరిచయమైంది అక్కడే..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కానిస్టేలు్‌గా పని చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 2025 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అతిసాధారణ స్థాయి నుంచి ఐపీఎస్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని వివరిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు చేశాడు. అదే సమయంలో ఐపీఎస్‌కు ఎంపికైన బాధితురాలు (మహిళా ట్రైనీ ఐపీఎస్) ఆ పోస్టుకు స్పందిస్తూ.. మెస్సేజ్ చేయడంతో ఇరువురి మధ్య పరిచయం ఏర్పడింది. శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో, లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో
శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇరువురి మధ్య స్నేహం ప్రేమగా మారింది.
దూరం పెట్టడంతో ఆమె భర్తకు వీడియోలు..
ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనలో మార్పు రావడంతో బాధితురాలు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన కృష్ణారెడ్డి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. తిట్టడం, అవమా నించడం, ఆమె ల్యాప్‌టాప్‌ను విసిరి పారేయడం వంటి పనులు చేశాడు. ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌ను బయట పెడతానని, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించాడు. దీంతో బాధితురాలు కృష్ణారెడ్డిని సోషల్ మీడియాలోనూ బ్లాక్ చేసింది. పూర్తిగా అతన్ని దూరంగా పెట్టింది. ఇదితట్టుకోలేక పోయిన కృష్ణారెడ్డి ఇన్ స్టాగ్రామ్ నకిలీ ఐడీలతో ఆమెను వేధించాడు. ఈ క్రమంలోనే ఇటీవల బాధితురాలి జట్టు పట్టుకొని తన గదిలోకి ఈడ్చుకెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి.. మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. అంతటితో ఆగకుండా బాధితురాలికి తెలియకుండా తీసిన వీడియోను ఆమె భర్తకు పంపించాడు.
14రోజులు రిమాండ్..
ఉదయ్ కృష్ణారెడ్డి అకృత్యాలు మితిమీరి పోవడంతో మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దీంతో అతను పరారయ్యాడు. అతడి ఆచూకీ తెలుసుకున్న అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని మిర్యాలగూడ సమీపంలో అరెస్టు చేశారు. అనంతరం అతన్ని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో విచారించి, ఉప్పర్పల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితునికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
