Triton Electric Vehicle
Triton Electric Vehicle : తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ వెహికిల్స్ తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ట్రైటాన్-ఈవీ(Triton Electric Vehlicle Pvt Ltd) తెలంగాణలో భారీగా పెట్టబడులు పెట్టనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏకంగా రూ. 2వేల 100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పెట్టుబడితో సుమారు 25 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రగతి భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికను వివరించారు. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్‌కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రల్లో అవకాశాలను పరిశీలించిన తర్వాత.. తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. ఈమేరకు జహీరాబాద్ నిమ్జ్‌లో(National Investment & Manufacturing Zone -NIMZ) తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపింది.
తొలి ఐదేళ్లలో 50వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అందులో సెమీ ట్రక్కులు, సెడాన్స్, లగ్జరీ ఎస్ యూవీలు, రిక్షాస్ ఉంటాయని తెలిపారు. టెస్లాకు పోటీ ఇవ్వాలని అనుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అలాగే ఆల్ ఎలక్ట్రిక్ సెమీ ట్రక్ తయారీపై దృష్టి పెట్టామన్నారు. గతేడాది ఏప్రిల్ లో ట్రైటాన్-ఈవీ ఎస్ యూవీ(మోడల్ -హెచ్) తయారు చేసింది. 1,126kms రేంజ్, 200kWh బ్యాటరీ సామర్థ్యం. అమెరికా బేస్డ్ సోలార్ బ్యాటరీ కంపెనీ ట్రైటాన్ సోలార్ కి చెందినదే ట్రైటాన్ ఈవీ.