టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్య..పాడె మోసిన మంత్రి హరీష్ రావు

  • Publish Date - November 11, 2020 / 09:26 PM IST

TRS Activist commits suicide : సిద్దిపేట జిల్లాలో విషాదం నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేక కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన దౌల్తాబాద్‌ మండలం కొనయిపల్లిలో చోటుచేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడిపోవడంతో మనస్తాపం చెందిన ఆ పార్టీ కార్యకర్త స్వామి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు చేసుకున్నాడు.



విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు కొనయిపల్లికి వెళ్లి స్వామి మృతదేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. అంత్యక్రియల అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని, ధైర్యంతో ముందుకు సాగాలన్నారు. కార్యకర్తలందరూ సంయమనంతో ఉండాలని, సహనం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కాదన్నారు.



స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డానని తెలిపారు. స్వామి చాలా చురుకైన కార్యకర్త అన్నారు. పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకుంటుందని చెప్పారు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజంగానే ఉంటాయి.. కానీ అనుకోని సంఘటన జరిగినప్పుడు కార్యకర్తలు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోకుండా ఉండాలని సూచించారు.