మేయర్, డిప్యూటి మేయర్ పదవులపై టీఆర్ఎస్ ఫోకస్..అభ్యర్థులపై మొదలైన కసరత్తు

  • Publish Date - December 6, 2020 / 07:58 AM IST

TRS focus mayor and deputy mayor : గ్రేటర్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ తదుపరి కార్యాచరణకు సిద్ధమైంది. మేయర్, డిప్యూటి మేయర్ స్థానాలు దక్కించుకోవడం కోసం అనుసరించాల్సిన వ్యూహాలతో అభ్యర్థులపై కసరత్తు మొదలు పెట్టనుంది. స్పష్టమైన ఆధిక్యత రాకపోవడంతో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని భావిస్తోంది.



గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు రావడంతో షాకైన గులాబీ పార్టీ.. తదుపరి పరిణామాలపై ఫోకస్ పెట్టింది. 150 డివిజన్లకు 75కు పైగా డివిజన్లలో విజయం సాధిస్తే మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు అధికార పార్టీకి సులువుగా దక్కేవి. కానీ మెజార్టీ సీట్లు రాకవడంతో కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగా ఇవాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిథిలోని ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.



ఈ భేటీలోనే గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించడంతో పాటు.. మేయర్, డిప్యూటీ పదవులు అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి వ్యవహరించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త కార్పొరేటర్లకు పలు సూచనలు చేయనునట్లు తెలుస్తోంది.

కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రజలతో మమేకమై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంటుంది.



బల్దియా పీఠం కోసం ఎంఐఎం సహాకారం తప్పనిసరి కావడంతో ఆ అంశంపై కూడా చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలకు ఎంఐఎం సహకరిస్తుండటంతో.. మేయర్ ఎన్నిక కోసం కూడా సహకరిస్తుందని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా బీజేపీ నుంచి విమర్శలు ఎదురైతే దానిని తిప్పికొట్టేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అంశాన్ని తెరపైకి తేవాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.



మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు మరో రెండు నెలల సమయం ఉండడంతో అప్పటి వరకు రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో అన్న చర్చ అధికార పార్టీలో మొదలైంది.