TRS TO BRS
TRS TO BRS : అది 2001 ఏప్రిల్ 27.. వేదిక హైదరాబాద్‌లోని జలదృశ్యం. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పురుడుపోసుకుంది. కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఉద్యమ పార్టీ కాస్తా రాజకీయ పార్టీగా మారింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు గులాబీ బాస్. బీఆర్ఎస్‌గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఏప్రిల్ 27న గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. అప్పటి టీఆర్ఎస్… ఇప్పటి బీఆర్ఎస్ ప్రస్థానం
చాలా మంది చరిత్ర నుంచి ప్రభావితమవుతారు. కొందరే చరిత్రను ప్రభావితం చేస్తారు. అలాంటి వారిలో కేసీఆర్ అలియాస్… కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకరు. తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచి, ఉరికించి, విజయతీరాలకు చేర్చారు. కేసీఆర్ ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు అడ్డంకులన్నీ దూదిపింజాల్లా తేలిపోయాయి. అసాధ్యం అనుకున్న దాన్ని సాధించారు కేసీఆర్. గులాబీ బాస్ నేతృత్వంలో సబ్బండ వర్గాల పోరాట ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతరించింది. సబ్బండ వర్గాలందరికీ గులాబీ జెండా నీడైంది.
1969 ప్రత్యేక ఉద్యమం చల్లబడి పోయిన తర్వాత, ఆశలన్నీ సన్నగిల్లిన వేళ.. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించగల మరో నాయకుడు ఉద్భవించగలడా అని జనం ఎదురు చూశారు. సరిగ్గా అప్పుడే గులాబీ జెండాను చేతబూని కేసీఆర్ బయల్దేరారు. చినుకుగా మొదలైన ఆ ఉద్యమ ప్రస్థానం అనతి కాలంలోనే తుఫాన్‌గా మారి… రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది. 2001 ఏప్రిల్ 27న కొంతమంది తెలంగాణవాదుల సమక్షంలో టీఆర్ఎస్‌ను ప్రకటించారు. ఇందుకోసం హైదరాబాద్ లోని జలదృశ్యం వేదికైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ ఏర్పాటు ఓ సంచలనం. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా.. ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో.. పక్కాగా తెలుసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర కల సాధ్యం అవుతుందా లేదా అని చాలా కళ్లు అనుమానంగా చూసిన వేళ.. ఏళ్ల ఎదురుచూపునకు ఓ పరిష్కారం లభించేలా చేశారు. కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో తేలిపోవాలని 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.
ఉద్యమ చరిత్రలో ఇదే కీలక మలుపు. ఓ వైపు ఉద్యమ పార్టీగా దూకుడుగా వెళ్తూనే.. రాజకీయ పార్టీగానూ టీఆర్ఎస్‌ను బలోపేతం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారంలో కీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం కల సాకారమైంది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయదుందుభి మోగించింది. సీఎంగా కేసీఆర్ పదవి చేపట్టారు. అలాంటి చరిత్ర కలిగిన టీఆర్ఎస్… ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారింది. ఉద్యమ నేతగా చాలామంది విజయం సాధించారు.. కానీ అటు ఉద్యమ సారథిగా ఇటు పాలకుడిగా ఒ క్క కేసీఆర్ విజయవంతం అయ్యారు.
కలలు కనడం కాదు.. సాకారం చేసుకోవడం తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఆ గుణమే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేలా చేసింది. ఏ పార్టీ టచ్ చేయలేని లెవల్‌లో టీఆర్ఎస్‌ను నిలబెట్టింది. అలాంటి కేసీఆర్.. ఇప్పుడు మరో కలను సాకారం చేసుకునేందుకు జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. పార్టీ ప్రకటించారు. అడుగులు మరింత వేగంగా వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2022లో విజయదశమి రోజు టీఆర్ఎస్ చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా జాతీయపార్టీగా రూపాంతరం చెందింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా పురుడుపోసుకున్న టీఆర్‌ఎస్.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్‌గా మారింది.
కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్… ఆ దిశగా పావులు కదుపుతూ వచ్చారు. దేశవ్యాప్త పర్యటనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంటే లక్ష్యంగా అడుగులు వేశారు. ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన పలు సభల్లోనూ పదే పదే జాతీయ రాజకీయాల్లోకి పోదామా అంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. కేంద్రంలోని బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్… జాతీయ పార్టీ అంటూ హింట్ ఇస్తూ వచ్చారు. చెప్పినట్లే నిజం చేశారు. రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణతో ఉన్న పార్టీని.. ఇప్పుడు దేశం కోసం నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశానికి పరిచయం చేస్తూ.. జాతీయ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు కేసీఆర్.