TSRTC MD Sajjanar condemn on Woman Passenger Attack on Conductor
TSRTC MD Sajjanar : హైదరాబాద్ హయత్‌నగర్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సులో యువతి హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిన యువతి చిల్లర విషయంలో కండక్టర్‌తో గొడవకు దిగింది. విధుల్లో ఉన్న కండక్టర్‌ను కాలితో తన్నుతూ బండబూతులు తిడుతూ నానా రచ్చ చేసింది. యువతి చేసిన హంగామాను బస్సుల్లో ఉన్న ప్రయాణికులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్స్ ఆ యువతిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
కండక్టర్‌కు వార్నింగ్
హయత్‌నగర్ బస్ డిపో-1 కు చెందిన బస్సు హయత్ నగర్ నుంచి అప్జల్ గంజ్ బయల్దేరింది. హయత్‌నగర్ పరిధిలోని బస్టాప్‌లో ఓ యువతి మద్యం మత్తులో బస్సు ఎక్కింది. చిల్లర విషయంలో కండక్టర్‌పై యువతి తిట్ల దండకం అందుకుంది. అంతటితో ఆగకుండా కాలితో తన్నుతూ.. నానా రచ్చ చేసింది. తోటి ప్రయాణికులు వద్దని వారించినా ఆమె వినలేదు. పైగా వారిపైనే దాడి చేసేందుకు యత్నించింది. తాను లోకల్ అని.. నీ సంగతి చూస్తానంటూ కండక్టర్‌కు వార్నింగ్ ఇచ్చి బస్సులోంచి దిగిపోయింది.
సజ్జనార్ సీరియస్
బస్సులో కండెక్టర్‌పై దాడి ఘటనను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మొదటి ట్రిప్పులో తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించిన ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడిందన్నారు. ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించినా.. దాడులకు పాల్పడిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు సజ్జనార్.