Chandrababu Naidu
TDP Public Meeting: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికతో టీటీడీపీ క్యాడర్ ముందుకెళ్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సత్తాచాటేందుకు అ పార్టీ నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా క్యాడర్ లో నూతనోత్సాహాన్ని నింపేందుకు ఖమ్మంలో ‘టీడీపీ శంఖారావం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్ధార్ పటేల్ స్టేడియంలో సాయంత్రం 3గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కృషి చేస్తున్నారు. తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కాసాని జ్ఞానేశ్వర్ చేపట్టిన కొద్దిరోజులకే ఈ బహిరంగ సభ జరుగుతుంది. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. దాదాపు సభకు లక్షమందిని తరలించేలా చర్యలు చేపట్టారు. భారీ హోర్డింగ్ లు, ప్లెక్సీలు, జెండాలతో పసుపు మయంగా మారింది.
TTDP New President: తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక
ఉదయం 9గంటలకు హైదరాబాద్ రసూల్ పూరాలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం భారీ వాహన శ్రేణిలో ర్యాలీగా టీటీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ముఖ్య నేతలతో కలిసి చంద్రబాబు ఖమ్మంకు వెళ్తారు. ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద భారీ ద్విచక్రవాహన ర్యాలీతో చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతారు. మయూరి సెంటర్ నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభాస్థలి వద్దకు చేరుకుంటారు. సభలో ప్రసంగించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.