Tummala Nageswara Rao Fires On KCR
Tummala Nageswara Rao Fires On KCR : తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎమ్మెల్యేని చేసి, మంత్రి పదవి ఇస్తే.. బీఆర్ఎస్ కు ద్రోహం చేశారు అంటూ సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల ఫైర్ అయ్యారు. నా 40 ఏళ్ల రాజకీయం గురించి మాట్లాడటం కేసీఆర్ కు తగదన్నారు. సీఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి తన గురించి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. నువ్వు నాకు పదవి ఇవ్వడం ఏంటి? నేనే నీకు పదవి ఇప్పించా అంటూ హాట్ కామెంట్స్ చేశారు తుమ్మల.
చంద్రబాబుకి చెప్పి..
”అభివృద్ధిలో నాకంటే ఎక్కువ ఈ జిల్లాలో ఎవరూ చేయలేదు. నేను బీఆర్ఎస్ లో చేరినప్పుడు వచ్చిన జనం కూడా ఈరోజు సభలో లేరు. నా గురించి తెలుసు. నాపై పోటీ చేసే వ్యక్తి గురించి మీకు తెలుసు అంటూ పువ్వాడపై విమర్శలు చేశారు తుమ్మల. నాలుగు సంవత్సరాల నుండి నియోజకవర్గ ప్రజలు నలిగిపోయారు. పోలీస్ కబంద హస్తాల పానలనలో ప్రజలు చీకటి జీవితాన్ని గడుపుతున్నారు. అప్పుడు చంద్రబాబుకి చెప్పి గోదావరి జలాలను రెండు రాష్ట్రాలు వాడుకునేలా చేశా. సీఎం పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఇతర పార్టీల నుండి వచ్చిన వారే. పోలీసులు అరాచకాలకు పాల్పడుతూ ప్రజలు ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తున్నారు. ఇలాంటి అరాచకాల పాలన పోవాలనే సోనియా గాంధీ నాకు ఖమ్మం సీటు ఇచ్చారు.
అందుకే పార్టీ మారా..
ఖమ్మం రోటరీ నగర్ 9వ డివిజన్ లో ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడారు. ”రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న వెంటనే నా పేరు ఖరారైంది. నన్ను గెలిపించి, ఇక్కడి ప్రజల గౌరవంగా జీవించే స్వేచ్ఛను ప్రసాదించాలని కోరుతున్నా. బూటకపు పథకాలతో వచ్చే వారిని తన్ని తరమాలి. అందరం అన్నదమ్ముళ్లా ఉంటున్నాం. గోదావరిలో ఇసుక దొరకదు. రఘునాధపాలెంలో గుట్టలుండవ్. ఎవరన్నా ప్లాట్ కొంటే తెల్లారేసరికి ఆనవాళ్లు మారుతున్నాయి. ప్రజల కోసం పార్టీ మారాను. పదవి కోసం పార్టీ మారలేదు. నాకు ఆ అవసరం లేదు. 1995లోనే నీకు నేను పదవి ఇప్పించా కేసీఆర్. నువ్వు నాకు పదవి ఇవ్వడం ఏంటి కేసీఆర్.
Also Read : ఓడి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రిని చేశా, ఆయనే బీఆర్ఎస్‌కు ద్రోహం చేశాడు- తుమ్మలపై సీఎం కేసీఆర్ ఫైర్
పాలేరు ప్రజలు నిన్ను క్షమించరు..
నీ రాజకీయాలు తాచుపాము లాంటివి. తన గుడ్లు తానే మింగినట్టు నీ రాజకీయాలే నిన్ను బొంద పెడతాయి. ఆత్మ వంచన చేసి మాట్లాడావ్ కేసీఆర్. పాలేరులో మూడు పంటలు పండించే స్థాయికి తీసుకొచ్చిన నన్ను అవమానించావు. పాలేరు ప్రజలు నిన్ను క్షమించరు. ఇవాళ నువ్వు మాట్లాడిన మాటలతో నీకు మతిస్థిమితం లేదనేది అర్ధమైంది. నీ చిల్లర రాజకీయాలు నాకు తెలుసు. నా స్థాయి నాకు తెలుసు. ప్రజాసేవ కోసం వచ్చాను. తొందరపడను.
ఏనాడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు..
నేను ఏ పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీల నేతలను ఇబ్బంది పెట్టలేదు. నా వాళ్ళు తొందర పడ్డా వాళ్ళని గద్దించా. ఖమ్మం అంటే ఒకరినొకరు నరుక్కునే రాజకీయాలుండేవి ఒకప్పుడు. అపుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అవి మారాలని అభివృద్ధి వైపు మళ్లించా. ఈ జిల్లా రాజకీయ పరిస్థితులను మార్చాను. నేను పొలంలో ఉంటే నన్ను పిలుచుకొని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు” అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఇటీవలే పార్టీలో చేరి టికెట్లు దక్కించుకున్న వారు వీరే