మంత్రివర్గ విస్తరణ..మరికొన్ని పదవుల పంపకంతో తెలంగాణ ప్రభుత్వంలో మరో రెండు పదవులు ఖాళీ అయ్యాయి. విప్‌గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ మంత్రి అయ్యారు. మరో విప్ రామచంద్రునాయక్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయ్యారు. దీంతో ఈ రెండు పోస్టుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నారట. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్ కుమార్ ఖాళీ చేసిన ప్రభుత్వ విప్‌పై అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కన్నేశారట. అందుకోసం ఆ ఎమ్మెల్యే ఒక అదిరిపోయే స్కెచ్ వేశారంటున్నారు.
ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకోవడానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి తన మనసులోని మాటను చెప్పారట. అంతేకాదు వారి దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి అదిరిపోయే స్కెచ్ వేశారంటున్నారు. ప్రభుత్వ విప్ పదవి అంటే..ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ గొంతుకగా ఉండాల్సి ఉంటుంది. ప్రతిపక్షాలను ఎండగట్టడంతో పాటు..ప్రభుత్వ విధానమేంటో సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
దీని కోసం మేడిపల్లి సత్యం ట్రయల్స్ చేస్తున్నారట. ప్రెస్ మీట్లు పెడుతూ హడావుడి చేస్తున్నారట మేడిపల్లి సత్యం. ప్రతిపక్ష నేతలు ఎవరైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు.. వెంటనే మేడిపల్లి సత్యం వాలిపోతున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ లీడర్లు కేటీఆర్, హరీశ్‌రావులు విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో ముందుంటున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టగలిగితే ముఖ్యనేతల దృష్టిని ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారట మేడిపల్లి సత్యం.
అందుకే అభివృద్ధి కార్యక్రమాల కోసం నియోజకవర్గ పర్యటన చేస్తున్నా..మళ్లీ వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయి ప్రెస్ మీట్‌లు పెడుతున్నారట. సీఎల్పీ వేదికగా ప్రెస్‌మీట్లతో ప్రతిపక్షాలపై దూకుడు పెంచితే..అసెంబ్లీలో పోస్ట్ దక్కుతుందని..ఆ తర్వాతే అదే దూకుడును కంటిన్యూ చేయొచ్చనేది మేడిపల్లి సత్యం ఆలోచనట. అందుకే విపక్ష నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటున్నారు మేడిపల్లి సత్యం. ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి మరి.