బాచంపల్లి సంతోష్ కుమార్ ఉగాది పంచాంగం.. చంద్రబాబు, పవన్, జగన్, రేవంత్, కేసీఆర్ జాతకాలు ఇలా ఉన్నాయి?

"జగన్‌కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి తెలిపారు.

Dr. Bachampalli Santhosh Kumar Shastry

ఉగాది సందర్భంగా శృంగేరీ శారదా పీఠం ఆస్థాన పండితుడు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి పలువురు ప్రముఖుల జాతకాల గురించి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొంతవరకు బాగానే ఉంటుందన్నారు.

“రాజుకు (సీఎంకి) సమన్వయ లోపం తలెత్తవచ్చు. ఒకరిద్దరు సీనియర్‌ నాయకులకు అనారోగ్య సమస్యలు రావచ్చు. తెలంగాణలో కుజుడి ప్రభావం వల్ల రియల్‌ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. పారిశ్రామిక రంగం వృద్ధిలోకి వస్తుంది.

ప్రధానమంత్రి సమర్థవంతంగా దేశాన్ని కాపాడతారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభావవంతంగా పనిచేస్తారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిపక్షానికి సంబంధించిన గొడవలు బాగా ఉంటాయి. శుక్రుడి ప్రభావంతో మీడియా రంగానికి న్యూస్ బాగా ఉంటుంది” అని చెప్పారు.

రేవంత్‌ రెడ్డి జాతకం
“రేవంత్‌ రెడ్డికి సంబంధించిన నామ నక్షత్రం చూస్తే అంతా బాగానే ఉంటుంది. సమర్థవంతంగా పరిపాలన చేస్తారు. దైవానుగ్రహం ఉంది. గత ఏడాది కంటే ఈ ఏడాది అనుకూలత పెరుగుతుంది. అంతర్గత కలహాలు మాత్రం ఉంటాయి. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి దైవారాదన చేయాలి” అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి తెలిపారు.

కేసీఆర్
“కేసీఆర్‌కి శని దోషం తొలగిపోయింది.. జాతకరీత్యా అనుకూలత పెరుగుతుంది. మంచి సూచనలు కనపడుతున్నాయి వ్యక్తిగతంగా బలపడతారు” అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి చెప్పారు.

చంద్రబాబు
“చంద్రబాబుకి కూడా జాతకం అద్భుతంగా ఉంది. చంద్రబాబుకి ఈ స్థాయి వస్తుందని రెండేళ్ల క్రితం ఎవ్వరూ ఊహించలేదు.
దేశంలోనే కీలకమైన నేతగా తన ప్రభావాన్ని గత ఏడాది చూపించారు. ఈ ఏడాది చూపించబోతున్నారు” అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి తెలిపారు.

పవన్
“పవన్ కల్యాణ్‌కి తిరుగులేదు. ఆయన జాతక బలం, దైవబలం, సాధనాబలం, ఆయనను అప్రతిహతంగా నడిపిస్తుంది. వచ్చే ఏడాదిలోపు రాజకీయ వ్యవస్థలో అత్యున్నత ప్రభావశీల నాయకుడిగా పవన్ పేరును చూస్తాం. దేశ, రాజకీయ చరిత్రలో చూస్తాం. ఆయన ముద్ర దేశంపై ఉంటుంది” అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి చెప్పారు.

జగన్
“జగన్‌కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం” అని బాచంపల్లి సంతోష్ కుమార్‌ శాస్త్రి తెలిపారు.