Ugadi (1)
Ugadi Festival In Mothkur Village : ఉగాది పండుగ అంటే..షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, బక్ష్యాలు, మామిడి తోరణాలు, పంచాంగ శ్రవణం. కానీ అక్కడ మాత్రం భిన్నం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసం, ముత్యాలమ్మకు బోనాలు, ఎడ్లబండ్లు, వాహనాల ప్రదర్శన…అలా ఆనందోత్సాహాలతో ఉగాదిని వేడుకగా జరుపుకుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఉగాది పండుగను భిన్నంగా జరుపుకోవడం శతాబ్దకాలంగా వస్తోంది. అప్పట్లో మోత్కూరులో వేసవి కాలంలో అమ్మవారు సోకి పెద్ద సంఖ్యలో చనిపోయేవారట. గ్రామంలో తూర్పున, పడమర కొలువై వున్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురికావడంతోనే అమ్మవారు సోకి మరణాలు సంభవిస్తున్నాయని ప్రజలు, గ్రామ పెద్దలు విశ్వసించేవారు. దాంతో ఉగాది పర్వదినం రోజు ఊరంతా ముత్యాలమ్మలకు బోనాలు వేసి, జంతుబలి వచ్చి…అమ్మవార్లను శాంతింపజేసేవారట. అలా చేయడం వల్ల ఒక్కసారిగా గ్రామంలో మశూచి తుడిచిపెట్టుకుని పోయిందని ఆ గ్రామ పెద్దలు చెప్తుంటారు.
Read More : Ugadi Asthanam : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం
నాటినుంచి నేటి వరకు అక్కడ అదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఉగాది పండుగ రోజున గ్రామస్తులంతా ఉగాది పచ్చడితో పాటు తూర్పున ముత్యాలమ్మ, పడమర ముత్యాలమ్మలకు యాటలు, కోళ్లు బలి ఇస్తారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఉగాది ముందు రోజు రాత్రి మహిళలు భక్తి శ్రద్ధలతో చలి బోనాలు వండుతారు. రైతులు ఎడ్లబండ్లను, వాహనాలను శుభ్రం చేసి అందంగా అలంకరిస్తారు. బోనాలను పసుపు, కుంకుమ, వేప మండలతో సిద్ధం చేస్తారు. ఉదయాన్నే ఊర్లో వాళ్లంతా ఉగాది పచ్చడితోపాటు మందు, మాంసాలతో విందు భోజనం చేస్తారు. తర్వాత మధ్యాహ్నం గ్రామ మహిళలంతా బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా హైస్కూల్ ఆవరణలోకి ప్రవేశిస్తారు.
Read More : Ugadi Celebration : ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు.. కేసీఆర్ ఛలోక్తులు
ఇక అక్కడినుంచి సందడే సందడి. రకరకాలుగా అలంకరించిన ఎడ్లబండ్లు, బైకులు, కార్లు, లారీలు, జీపులు అలా పలు వాహనాలను ‘ హోళింగా..హోళింగా ‘ అంటూ బోనాల చుట్టూ తిప్పుతారు. ఎడ్లబండ్లను, వాహనాల ప్రదర్శనను పోటాపోటీగా నిర్వహిస్తారు. దాదాపు రెండునుంచి మూడు గంటలపాటు ఈ ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ఉగాది వేడుకలను చూసేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామాల ప్రజలు పెద్దయెత్తున తరలి వస్తారు. అనంతరం మహిళలు బోనాలతో హైస్కూల్ ఆవరణనుంచి నేరుగా ముత్యాలమ్మ ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత స్థానిక రామలింగేశ్వర స్వామి ఆలయంలో పండితులు నిర్వహించే పంచాంగ శ్రవణంతో వేడుకలను ముగిస్తారు. మోత్కూరుతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్లబావి, కొండాపురం, ఆరెగూడెం గ్రామాల ప్రజలు ఈ భిన్నమైన ఉగాదిని జరుపుకుంటారు. కరోనా మూలంగా ఈ వేడుకలకు రెండేళ్లుగా దూరంగా ప్రజలు..ఈసారి ఘనంగా జరుపుకుంటున్నారు.