Telangana BJP : మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.? బెర్త్ ఎవరికి.? ఆ ముగ్గురిలో ఎవరికి ఛాన్స్ దక్కబోతుంది..
Telangana BJP : బీజేపీ ఏ ఎంపిక చేసిన..ఏ నేతకు ఏ పదవి ఇచ్చినా ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు జాతీయ కార్యవర్గం విషయంలో కొత్త ఈక్వేషన్స్ ఉన్నాయంటున్నారు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణ బీజేపీ నేతలకు అవకాశం దక్కలేదు.. దీంతో త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు అవకాశం దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది.
- Harish Thanniru
- Updated on- August 18, 2026 / 10:07 AM IST
Telangana BJP
Telangana BJP : త్వరలో సెంట్రల్ క్యాబినెట్ షఫ్లింగ్. మోదీ టీమ్‌లో తెలంగాణ నుంచి ఎర్త్ ఎవరికి.? బెర్త్ ఎవరికి.? ఎలక్షన్ టీమ్‌లో ఉండేదెవరు.? ఇన్నాళ్లు హాట్ టాపిక్‌గా నడిచిన ఈ చర్చకు కాస్త బ్రేక్ పడింది. ఇప్పట్లో కేంద్రమంత్రి వర్గ విస్తరణ ఉండబోదోన్న సంకేతాలు వచ్చాయి. ఇంతలోనే జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. బీజేపీ నేషనల్ టీమ్‌లో తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదు. మొన్నటి వరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కొనసాగారు. కొత్త టీమ్‌లో ఈ ముగ్గురికీ చోటు దక్కకపోవడం రకరకాల చర్చకు దారి తీస్తోంది. తెలంగాణలో పార్టీని మరింత విస్తరించడమే లక్ష్యమని..వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్ అంటున్న బీజేపీ..జాతీయ స్థాయి పదవుల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం కల్పించకపోవడం రాజకీయ వర్గాల్లో డిస్కషన్ పాయింట్ అవుతోంది.
బీజేపీ ఏ ఎంపిక చేసిన..ఏ నేతకు ఏ పదవి ఇచ్చినా ఓ లెక్క ఉంటుంది. ఇప్పుడు జాతీయ కార్యవర్గం విషయంలో కొత్త ఈక్వేషన్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జాతీయ కార్యవర్గంలో నేతలకు చోటు కల్పించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఒక్కరంటే ఒక్కరికి ఛాన్స్ ఇవ్వకపోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయంటున్నారు. కీలక పదవులు కట్టబెట్టినా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నేతలు రోడ్‌మ్యాప్ రెడీ చేయకపోవడంపై బీజేపీ జాతీయ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందుకే తెలంగాణ నేతలకు చోటు కల్పించలేదంటున్నారు. మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణకు కేంద్రమంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తారని అంటున్నారు. లేటెస్ట్ నియామకాలు చూస్తే తెలంగాణకు అదనంగా మరో బెర్తు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు.
డీకే అరుణ పేరు క్యాబినెట్ రేసులో బలంగా వినిపించింది. ఆమెను ఇప్పుడు జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించి.. ఆ పోస్ట్‌ను పురంధేశ్వరికి అప్పగించారు. అంటే క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్ జరిగితే ఏపీ నుంచి కొత్తగా ఎవరికి అవకాశం దక్కదన్న ఇండికేషన్ జాతీయ నాయకత్వం ఇచ్చిందంటున్నారు. కేంద్రమంత్రి వర్గ విస్తరణలో తెలంగాణకు ప్రయారిటీ ఇచ్చేందుకే..జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని చెబుతున్నారు. ఉమెన్ కోటాలో డీకే అరుణకు మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయమని అంటున్నారు.
ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండిసంజయ్‌కు తిరిగి పోస్ట్ కంటిన్యూ చేయలేదు. ఆయనకు మళ్లీ రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బండి సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ లేకపోతే ధర్మపురి అర్వింద్‌ను మోదీ టీమ్‌లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్ర నేతలకు చోటు దక్కకపోవడంపై అయితే రకరకాల చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ బలంగా ఉంది. పైగా సీనియర్ లీడర్లు ఉన్నారు. అయినా తెలంగాణ నుంచి ఒక్క నేతను జాతీయ కార్యవర్గంలో తీసుకోలేదంటే..బీజేపీ అధిష్టానం పెద్దల మాస్టర్ ప్లాన్ వేరే ఉందన్న చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఎలక్షన్స్ సెంట్రిక్‌గా తెలంగాణపై సీరియస్ ఫోకస్ చేసిన బీజేపీ హైకమాండ్.. మంత్రివర్గ విస్తరణ తర్వాత అసలు సిసలు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతుందని రాష్ట్ర నేతలు ధీమాతో ఉన్నారు.
అంతేకాదు పార్టీ పదవులు దక్కలేదంటే.. క్యాబినెట్ ఆశలు పెరిగినట్లేనని.. లాబీయింగ్ స్పీడప్ చేసే పనిలో బిజీ అయిపోతున్నారట కమలనాథులు. తెలంగాణ బీజేపీ నేతల్లో అమాత్యయోగం దక్కేదెవరికి.? ఇద్దరు సిట్టింగ్లలో ఎవరి పోస్ట్ ఊస్ట్ అయి..రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారో వేచి చూడాలి మరి.
